Tripura Polls : ప్రశాంతంగా ప్రారంభమైన త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్
ABN, First Publish Date - 2023-02-16T10:37:10+05:30
త్రిపుర శాసన సభ ఎన్నికల (Tripura Assembly Elections) పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది.
అగర్తల : త్రిపుర శాసన సభ ఎన్నికల (Tripura Assembly Elections) పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ (BJP)ని గద్దె దించాలనే లక్ష్యంతో బద్ధ శత్రువులైన కాంగ్రెస్, సీపీఎం ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి, తిప్ర మోత, కాంగ్రెస్-సీపీఎం మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఈ ఎన్నికల్లో బీజేపీ 55 స్థానాల్లోనూ, దాని మిత్రపక్షం ఆరు స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. అంపినగర్ నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్‌పీ మొత్తం మీద 47 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీలన్నీ ఓ కూటమిగా బరిలో నిలిచాయి.
తిప్ర మోత పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది.
ఓటర్లు చాలా ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారని, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు తగినంత భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
ఓటు వేసిన ముఖ్యమంత్రి సాహా
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా (Manik Saha) గురువారం మీడియాతో మాట్లాడుతూ, బోర్డోవలి నియోజకవర్గంలోని తులసీబాటి స్కూల్‌లో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో పాలుపంచుకోవాలని, ఓటు వేయాలని అందరినీ కోరుతున్నానని తెలిపారు. ఉన్నత త్రిపుర, శ్రేష్ఠ త్రిపుర నిర్మాణానికి ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.
రికార్డు సృష్టించాలి : మోదీ
త్రిపుర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని, ఓట్లు వేయాలని కోరారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Chandrababu TDP : రాజధానిపై జగన్ మాటలు వింటే ఊసరవెల్లికీ సిగ్గేస్తుంది
Donate eyes: కళ్లు విలువ తెలిసిన అంధుడు
Updated Date - 2023-02-16T10:37:25+05:30 IST