Karni Sena Chief Murder: కర్ణి సేన చీఫ్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు
ABN, First Publish Date - 2023-12-07T07:24:39+05:30
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హత్యకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో శ్యామ్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, బీట్ కానిస్టేబుల్‌పై బుధవారం జైపూర్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ విధించారు. కర్ణిసేన అధినేత భార్య షీలా షెకావత్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘సుఖ్‌వేవ్ సింగ్ గోగమేడి హత్యకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, బీట్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అలాగే నిందితులను 72 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.’’ అని తెలిపారు. కర్ణిసేన కార్యకర్తలకు ఆమె ఓ సందేశం పంపారు. ‘‘మీ సోదరి మిమ్మల్ని పిలుస్తోంది. మీరు బయటకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి. మీరంతా గురువారం వచ్చి గోగమేడికి చివరిగా నివాళులర్పించాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని ఆమె సందేశంలో పేర్కొన్నారు.
ఇక రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి భౌతికఖాయాన్ని ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం 7 గంటల నుంచి జైపూర్‌లోని రాజ్‌పుత్ సభా భవన్‌లో ఉంచనున్నారు. సుఖ్‌దేవ్ సింగ్ స్వగ్రామమైన గోగమేడిలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గోగమేడి అంత్యక్రియల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైపూర్‌తో పాటు రాజస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోని కొన్ని సున్నితమైన ప్రదేశాలలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గోగమేడి హత్య నేపథ్యంలో చేపట్టిన నిరసనలు తగ్గిపోయాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఓ అధికారి తెలిపారు. ‘‘మేము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. రాష్ట్ర పోలీసులతో సన్నిహిత సమన్వయంతో పని చేస్తున్నాము’’ అని చెప్పారు. ఇక హత్యకు దారితీసిన ఘటన మొత్తం క్రమాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి దర్యాప్తు చేస్తారని బుధవారం అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో మెట్రో మాస్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన నిరసనకారులు వెనక్కి తగ్గారు.
మరోవైపు గోగమేడి హత్య కేసును విచారించేందుకు డీజీపీ ఉమేశ్ మిశ్రా బుధవారం ప్రత్యేక ద ర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. గోగమేడిని జైపూర్‌లోని ఆయన ఇంట్లోనే ముగ్గురు దుండగులు మంగళవారం కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరు గోగమేడి భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోగా మిగిలిన ఇద్దరు పారిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు గోగమేడి హత్యను నిరసిస్తూ కర్ణిసేన కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. గోగమేడి హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-12-07T07:28:41+05:30 IST