HD Kumaraswamy: కర్ణాటక అజిత్ పవార్ ఎవరు..?.. హెచ్‌డీ సంచలన వ్యాఖ్య
ABN , First Publish Date - 2023-07-04T14:32:45+05:30 IST
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి అధికార శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరడం ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ ఓ అజిత్ పవార్ పుట్టుకొస్తారని అన్నారు.
బెంగళూరు: మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని చీల్చి అధికార శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ (Ajit pawar) చేరడం ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ ఓ అజిత్ పవార్ పుట్టుకొస్తారని, అక్కడ (Maharashtra) బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చినట్టు ఇక్కడ (Karnataka) ఏం జరుగుతుందోనని తాను భయపడుతున్నానని కుమారస్వామి అన్నారు. జేడీఎస్ శాసనసభా పక్షం సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
''రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మహారాష్ట్రలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఎవరైనా ఉహించారా? బీజేపీకి మద్దతివ్వాలని అజిత్ పవార్ నిర్ణయంతో తీసుకోవడంతో కర్ణాటకలో ఏమి జరుగుతోందనని నేను భయపడుతున్నాయి. సమీప భవిష్యత్తుల్లో కర్ణాటక అజిత్ పవార్ ఎవరు అవుతారో, ఏమి జరుగుతుందో వేచి చూడాలి'' అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది చివర్లోనో, పార్లమెంటు ఎన్నికల తర్వాతో..?
కాగా, కర్ణాటకలోనూ ఓ అజిత్ పవార్ పుట్టుకొస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామిని మీడియా మంగళవారంనాడు ప్రశ్నించినప్పుడు, తాను ఫలానా వ్యక్తి అని చెప్పదలచుకోలేదని, అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని సమాధానమిచ్చారు. అందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బహుశా ఈ ఏడాది చివర్లో కానీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత కానీ జరగవచ్చని, అప్పటి వరకూ వేచిచూద్దామని నవ్వుతూ ఆయన సమాధానమిచ్చారు.