Madhumanjari Selvaraj : ఆ కష్టం ఎవరికీ రాకూడదని..!
ABN , First Publish Date - 2023-08-12T03:24:18+05:30 IST
తీరికలేని వృత్తి జీవితానికి కొవిడ్ విరామాన్నిస్తే... గ్రామాల్లో నీటి కష్టాలు తనను జల సంరక్షకురాలిగా మార్చాయంటారు మధుమంజరి సెల్వరాజ్. పలు ప్రాంతాల్లో బావుల్ని పునరుద్ధరించి, ఎందరో మహిళల వెతలు

తీరికలేని వృత్తి జీవితానికి కొవిడ్ విరామాన్నిస్తే...
గ్రామాల్లో నీటి కష్టాలు తనను జల సంరక్షకురాలిగా మార్చాయంటారు మధుమంజరి సెల్వరాజ్.
పలు ప్రాంతాల్లో బావుల్ని పునరుద్ధరించి, ఎందరో మహిళల వెతలు తీరుస్తున్న ఈ ఇరవై ఏడేళ్ళ ఆర్కిటెక్ట్ గురించి, ‘పబ్లిక్ వెల్ రివైవల్ ప్రాజెక్ట్’ గురించీ ఆమె మాటల్లోనే...
‘‘నీరు సకల జీవులకూ ప్రాణాధారం. జల వనరులను ప్రాణప్రదంగా చూసుకొంటేనే మనకు మనుగడ. కానీ వాటిని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఉదాహరణకు మా తమిళనాడు రాష్ట్రాన్నే తీసుకుంటే... నూరు శాతం కొళాయి నీటి సరఫరా అవుతున్న జిల్లాలు కాంచీపురం, రాణిపేట... ఈ రెండు మాత్రమేనని సాక్షాత్తూ ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. గ్రామాల్లో చెరువులు, బావులకు సంరక్షణ లేకపోవడంతో... వేసవిలోనే కాదు, అన్ని ఋతువుల్లోనూ నీటికి కటకట తప్పడం లేదు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తిరువణ్ణామలై చుట్టుపక్కల గ్రామాలను నేను సందర్శించినప్పుడు... బిందెడు నీటి కోసం ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్తున్న మహిళల్ని చూసి దిగ్ర్భాంతి చెందాను. నేను వాలంటీర్‌గా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘చుక్కూ ఫారెస్ట్ స్కూల్’ (సిఎఫ్‌ఎస్)లోని స్నేహితుడు శ్రీరామ్‌తో ఈ విషయం పంచుకున్నాను. గంగానదిని కాలుష్యం నుంచి కాపాడాలనీ, నదీ గర్భంలో తవ్వకాలు ఆపాలనీ డిమాండ్ చేస్తూ 115 రోజులు నిరాహారదీక్ష చేసి మరణించిన స్వామి నిగమానంద జీవిత కథ పుస్తకాన్ని ఆయన నాకు ఇచ్చారు. అది చదివిన తరువాత కన్నీరు ఆపుకోలేకపోయాను. ‘ఒకవైపు జీవనదులు కాలుష్యంతో నాశనం అవుతూ ఉంటే... మరో వైపు నీటి కోసం కోట్లాదిమంది కష్టాలు పడుతున్నారు. మన వంతుగా ఏదైనా చెయ్యలేమా?’ అని సిఎఫ్‌ఎస్ సమావేశంలో చర్చించాం. సిఎఫ్‌ఎస్- తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని సింగారపేట్టైలో వ్యవసాయ నిపుణులు, పర్యావరణ వేత్తలు, పాత్రికేయులతో సహా వివిధ రంగాలకు చెందినవారు నిర్వహిస్తున్న లాభాపేక్షలేని సంస్థ. సమావేశంలో సభ్యులందరం ఎంతో ఆలోచించాక... జల సంరక్షణతో మొదటి అడుగు వేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ‘పబ్లిక్ వెల్ రివైవల్ ప్రాజెక్ట్’ (పిడబ్ల్యూఆర్‌పి) అలా ప్రారంభమైంది. ఇది మూడేళ్ళ కిందటి మాట.
40 ఏళ్ల తరువాత వినియోగంలోకి...
వృత్తిరీత్యా నేను ఆర్కిటెక్ట్‌ని. బహుళ అంతస్థుల భవనాలు, విలాసమైన బంగ్లాలు, ఫామ్ హౌస్‌లు... వీటి డిజైన్లతో తీరిక లేకుండా మూడేళ్ళు వివిధ సంస్థల్లో పని చేశాను. 2020లో కొవిడ్‌తో నా ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం దొరికింది. దాంతో వాలంటీర్‌గా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడే జల సంరక్షణ వైపు మళ్ళాను. ‘పిడబ్ల్యూఆర్‌పి’ని ఏర్పాటు చేశాక... తిరువణ్ణామలై, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సర్వే చేపట్టాం. పాడుబడిన, వాడకంలో లేని బావులు కొన్నిటిని గుర్తించాం. మరికొన్నిటిని ఆయా గ్రామాలవారు సూచించారు. మా కార్యక్రమం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి తీసుకున్నాం. మొదటగా ఆ బావుల అడుగున పేరుకుపోయిన బురదనూ, చెత్తనూ తొలగించాం. ఆ తరువాత... బావి చుట్టూ గోడలు కట్టి, నీళ్ళు తోడుకోవడానికి వీలుగా కప్పీలు అమర్చాం. చివరగా... బావికి సమీపంలో ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి, దానిలోకి నీరు వెళ్ళడానికి వీలుగా మోటార్ ఏర్పాటు చేశాం. దీనికోసం మా వాలంటీర్లు, ఎందరో శ్రేయోభిలాషులు విరాళాలు ఇచ్చారు. తిరువణ్ణామలై ప్రాంతంలో ఇది సక్సెస్ కావడంతో... ధర్మపురి, ఈరోడ్, కృష్ణగిరి, కళ్లకురిచ్చి, తిరుచెంగోడు తదితర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో అనేక బావుల్ని పునరుద్ధరించాం. బావి పరిస్థితిని బట్టి... దాన్ని బాగు చెయ్యడానికి నెల నుంచి మూడు నెలల కాలం పడుతుంది. ఈ మధ్యే అంతియూర్ హిల్స్‌పైన... కొండచెరియలు విరిగి పడడంతో ధ్వంసమైన ఒక బావిని బాగు చేశాం. దాని నుంచి దాదాపు 25 అడుగులమేర పేరుకుపోయి గట్టిపడిన బురదనూ, చెత్తనూ తొలగించాం. అలాగే నయాక్కనూర్ గ్రామంలో కుల ఘర్షణలతో మూత పడిన ఒక బావిని... ఇరు పక్షాలనూ ఒప్పించి, పునరుద్ధరించి, నలభయ్యేళ్ళ తరువాత వినియోగంలోకి తెచ్చాం. ఇలా పదుల సంఖ్యలో బావులు బాగుపడ్డాయి. ప్రతి చోటా బావుల చుట్టూ పెయింటింగ్స్ వేస్తున్నాం. బావుల పరిరక్షణ, చుట్టుపక్కల ప్రాంతాల పరిశుభ్రత బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తున్నాం.
ఊరు, నీరు శుభ్రంగా ఉండాలి...
ప్రస్తుతం మా టీమ్‌లో పదిహేను మంది పని చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో బావుల సంరక్షణను, పునరుద్ధరించాలనుకొనే స్థానికులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు నన్ను సొంత ఆడపడుచులా చూస్తున్నారు.. ఏటా ఆషాఢ మాసం సందర్భంగా జరిగే ‘ఆడి పెరుక్కు’ ఉత్సవాల కోసం... నన్ను ఆహ్వానించారు. బావుల చుట్టూ అలంకారాలు చేసి, వాటికి పూజలు చేశారు. సంగీత, నృత్యాలతో వేడుకలు నిర్వహించారు. నన్నూ ఆ సంబరాల్లో భాగం చేశారు. ఎక్కడికి వెళ్ళినా... ఊరు, నీరు శుభ్రంగా ఉండాలని చెబుతూ ఉంటాను. మన దేశంలో చరిత్రతో, సంస్కృతితో ముడిపడిన కథలున్న బావులు ఎన్నో కనిపిస్తాయి. కొళాయి నీరు అందుతున్న గ్రామాల్లో బావుల అవసరం లేదని ప్రజలు భావిస్తూ ఉండొచ్చు. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరుల్ని నిర్లక్ష్యం చేస్తే... నష్టపోయేది మనమే. సక్రమంగా నిర్వహించుకుంటే చాలు... ఎన్నో అవసరాలను అవి తీరుస్తాయి. మైళ్ళ దూరం నుంచి నీరు మోసుకొచ్చే కష్టం ఎవరికీ రాకూడదు. ఆ కష్టం నుంచి వీలైనన్ని గ్రామాలకు తప్పించాలనేదే మా తపన.’’