అజ్ఞానాన్ని తొలగించే శక్తి
ABN , First Publish Date - 2023-06-30T02:29:52+05:30 IST
‘గురువు’ అంటే చీకటిని పారద్రోలే శక్తి. చీకటి అంటే అజ్ఞానం. ఈ సంపూర్ణ విశ్వంలో గురువే జ్ఞానప్రదాత. జ్ఞానోదయాన్ని పొందడానికి మీకు గురువు ఉండనవసరం లేదేమో కానీ, గురువు ఉంటే అది సులభ సాధ్యమవుతుంది. జీవితంలో గురువు ప్రాధాన్యతను స్మరించుకొనే రోజు గురు పూర్ణిమ...

అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మైశ్రీ గురవేనమః
‘గురువు’ అంటే చీకటిని పారద్రోలే శక్తి. చీకటి అంటే అజ్ఞానం. ఈ సంపూర్ణ విశ్వంలో గురువే జ్ఞానప్రదాత. జ్ఞానోదయాన్ని పొందడానికి మీకు గురువు ఉండనవసరం లేదేమో కానీ, గురువు ఉంటే అది సులభ సాధ్యమవుతుంది. జీవితంలో గురువు ప్రాధాన్యతను స్మరించుకొనే రోజు గురు పూర్ణిమ. ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మానవుణ్ణి జీవన్మరణ చక్రం నుంచి కాపాడి, శాశ్వతమై ఆనందాన్ని పొందడానికి సహాయపడేది గురువు. అందుకే తైత్తరీయోపనిషత్తు ‘ఆచార్య దేవోభవ’ అని ప్రస్తుతించింది.
ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గురుపూర్ణిమ. వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన, మహాభారతాన్నీ, పురాణాలనూ రచించిన వేదవ్యాసుడి జన్మదినం ఇది. ఈ రోజు చేసే ప్రార్థనలు నేరుగా మహా గురువును చేరుకుంటాయనీ, ఆయన ఆశీస్సులు శిష్యుడి జీవితంలోని చీకటిని, అంటే అజ్ఞానాన్ని దూరం చేస్తుందనీ విశ్వాసం ఉంది.
ఇదే రోజున, బుద్ధ గయ నుంచి సారనాథ్‌కు వచ్చిన గౌతమ బుద్ధుడు తన మొదటి అయిదుగురు శిష్యులకు తొలి బోధలు అందించాడు. ఆ తరువాతే నెమ్మదిగా బౌద్ధ సంఘం ఏర్పడింది. అందుకే ఈ రోజును బౌద్ధులు ‘ధర్మ చక్ర ప్రవర్తన దినం’గా జరుపుకొంటారు. జైన మతం ప్రకారం ఈ రోజున మహావీరుడు తన మొదటి శిష్యుడైన గౌతమస్వామికి గురువు అయ్యాడు. కాబట్టి ఈ దినాన మహావీరుణ్ణి జైనులు పూజిస్తారు. ప్రాచీన భారత చరిత్ర ప్రకారం, రైతులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు. మంచి పంటల కోసం చక్కగా వర్షాలు పడాలని వారు దైవాన్ని ఆరాధిస్తారు. ఇంతకీ మానవ జీవితంలో గురువు పాత్ర ఏమిటి? గురువు తన శిష్యుల ఆధ్యాత్మిక పురోగతికి మార్గనిర్దేశం చేస్తాడు. పురుషులే గురువై ఉండక్కరలేదు. శ్రీశారదాదేవి, సోదరి నివేదిత, మాతా ఆనందమయి, మాతా అమృతానందమయి... వీరంతా గత శతాబ్ద కాలంలోని కొందరు ప్రముఖ మహిళా గురువులు.
ప్రపంచంలో నిజమైన జ్ఞానాన్ని మించిన స్వచ్ఛమైన విషయం మరొకటి లేదు. ఆ స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. భారతీయ సమాజంలో గురువుకు ఎంతో గౌరవం ఉంది. జైన, బౌద్ధ మతాలలో ఆచార్యుని స్థానం అత్యున్నతం. మహా వీరుడు సత్యాన్వేషణలో గృహ త్యాగం చేశాడు. ప్రజలను కష్టాల నుంచి రక్షించడానికి ఇల్లు విడిచిపెట్టాడు. చివరకు తన లక్ష్య సాధనలో కృతకృత్యుడయ్యాడు. నేటికీ జైనులు తమ గురువులను ఎంతో భక్తితో గౌరవిస్తారు. ప్రపంచంలో అహింసను నిజంగా పాటించేది జైనమతాచార్యులే.
ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిమాన్వితమైన గురువులు ఉన్నారు. వారిలో బుద్ధ భగవానుడు అగ్రగణ్యుడు. ఆయనకు పెద్ద సంఖ్యలో శిష్య వర్గం ఉండేది. వారు పురవీధుల్లో కానీ, బౌద్ధారామాలలో కానీ ఎల్లప్పుడూ ఆయనను అనుసరించేవారు. బుద్ధుడు వారికి తత్త్వ జ్ఞానాన్ని బోధించేవాడు. శరీరం అశాశ్వతమైనదనీ, ఎంతో జాగ్రత్తగా నిర్వాణ లక్ష్యాన్ని సాధించాలనీ బోధించేవాడు. ప్రజలందరూ తమంతట తామే జ్ఞానమార్గాన్ని చేరుకోవాలని సూచించాడు. ప్రపంచంలోని వివిధ రకాల ఆకర్షణల వెనుక ఉన్న ఆంతర్యాలను గుర్తించలేకపోతే.. ప్రజలందరూ అంధకారంలో మునిగి మృత్యుగతిని పొందుతారని చెప్పాడు. ‘సరైన జ్ఞానం’ అనే వెలుగులో ఆ అజ్ఞానాన్ని సంహరించాలని ఉపదేశించాడు. బుద్ధ భగవానుడి కాలంలో... భారతదేశంలో ఆరుగురు ప్రసిద్ధులైన ఆచార్యులు ఉండేవారు. వారు: పూరణ కస్సపుడు, అజిత కేస కంబలుడు, మక్కలి గోసాలుడు, పకుధ కచ్ఛాయనుడు, నిగంట నాట పుత్రుడు, సంజయ బేలత్తి పుత్తుడు. వీరు గొప్ప జ్ఞాన సంపన్నులు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. బౌద్ధ త్రిపిటకాలలో వీరి సిద్ధాంతాలు అంశమాత్రంగా దొరుకుతాయి. కానీ వీరి సిద్ధాంతాలకు ఉన్న నిజమైన వైశిష్ట్యాన్ని త్రిపిటక సంగ్రహకర్తలు కప్పిపుచ్చారు.
సనాతన భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన గొప్ప ఆచార్యుడు ఆదిశంకరులు. ఆయన వైదిక సంస్కృతిని పునరుజ్జీవింపజేస్తూ... భారతదేశం నలు దిక్కులా మఠాలను స్థాపించారు. ఆ మఠాలలో నేటికీ శంకర శిష్యులు శంకరాచార్య నామధేయంతో ప్రకాశిస్తున్నారు. ఆ తరువాత రామానుజులు భక్తి సిద్ధాంతాన్ని స్థాపించారు. అనంతర కాలంలో మధ్వాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ఖండించి, ద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఆయననే పూర్ణప్రజ్ఞుడు అని కూడా అంటారు. ఆయన ధర్మ స్థాపన కోసం 38 గ్రంథాలు రాశారు. ఆయన శిష్యులు వ్యాస తీర్థుడు, జయతీర్థుడు తదితరులు అద్వైత సిద్ధాంతాలను ఖండించారు. ఆయన శిష్యులలో గురు రాఘవేంద్రుడు అఖండ ఖ్యాతిని ఆర్జించిన మహాచార్యుడు. రాఘవేంద్రుడు కేవలం గురువే కాదు, మంత్రాలయ క్షేత్రంలో భక్తులతో పూజలు అందుకుంటున్న దైవం కూడా.
భారతదేశ ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికీ చాటిన మహిమాన్వితమైన గురువులు ఎందరో ఉన్నారు. కేవలం బౌద్ధాచార్యులనే తీసుకున్నా... అభయదత్తశ్రీ ఆనందగర్భుడు, అసంగుడు, అతిశుడు, భావ వివేకుడు, బోధిధర్ముడు, బోధిరుచి, బుద్ధభద్ర, బుద్ధదత్త, బుద్దఘోష, బుద్ధగుహ్య, బుద్ధపాలిత, ఆచార్య బుద్ధరక్ఖిత, చంద్రకీర్తి, ధర్మరత్న, దింగ్నాగ, గుణభద్ర, ఆచార్య నాగార్జున, ఆచార్య మౌద్గల్యయన, ఆచార్య మోగ్గలిపుత్త తిస్స, కాంతరక్సిత, సారిపుత్ర శాంతిదేవ, శీలభధ్ర, స్థిరమతి, సుభకరసిమ్హ, సుభూతి, వజ్రబోధి, వసుబంధు, వసుమిత్ర, విమలమిత్ర... ఇవి కేవలం కొన్ని పేర్లు మాత్రమే. మన దేశంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన గురువుల పేర్లన్నీ రాయాల్సి వస్తే వెయ్యి పుటల గ్రంథం అవుతుంది. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండే గురువుల ముందు వినయంతో ఉండాలి. వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. వారిని గౌరవించాలి.
ఆచార్య చౌడూరి ఉపేంద్రరావు
జెఎన్‌యూ, ఢిల్లీ.