Vankaya Kura : ముళ్ల వంకాయ కూరతో లాభాలెన్నో!
ABN , First Publish Date - 2023-01-07T00:06:46+05:30 IST
తోయాల్పస్విన్న బృహతీఫల మల్పఖండం దండాహతం చిరవిపాచితమాజ్యమధ్యే! చూర్ణేన సైంధవభవేన విమిశ్రితంచ వహ్నిం ప్రబోధయతి కాసనివారణం హి!
తోయాల్పస్విన్న బృహతీఫల మల్పఖండం దండాహతం చిరవిపాచితమాజ్యమధ్యే!
చూర్ణేన సైంధవభవేన విమిశ్రితంచ వహ్నిం ప్రబోధయతి కాసనివారణం హి!
ముళ్ల వంకాయ మొక్క మనకు దారి పక్కన తరచూ కనిపించేదే. మనం దాన్ని పిచ్చిమొక్క అనుకుంటాం. దాని ప్రభావం తెలిస్తే వదిలిపెట్టలేం. ఇది టమోటా, వంగ, ఆలు, కామంచి, పొగాకు, ఉమ్మెత్త మాదిరిగా సొలనేసీ కుటుంబానికి చెందిన మొక్క. ఇసుక నేలల్లో పెరుగుతుంది. దశమూలాల్లో ఒకటి. దీన్ని ‘బృహతీ’ అని కూడా పిలుస్తారు. కరోనా లాంటి వ్యాధుల మీద దశమూలాలు వెంటనే ఫలితాన్ని చూపించే శక్తిమంతమైన ద్రవ్యాలు. వాటిలో ఈ ముళ్ల వంకాయ (కంటకారి) ప్రముఖమైనది.
టమోటా పండ్లని మొన్నమొన్నటిదాకా ‘రామ్ములక్కాయ’ అనేవాళ్లు. అంటే పెద్దగా ఉండే ములగకాయ లేదా పండు అని! టమోటాల ఆకారంలోనే ఉండి పరిమాణంలో చిన్నగా ఉండే కాయలు కాస్తాయి కాబట్టి, ఈ ముళ్ల వంకాయల్ని ‘చిన్నములక’ అని, ఈ మొక్క నేలబారుగా పెరుగుతుంది కాబట్టి ‘నేలములక’ అని పిలుస్తారు. దీనికి ముళ్లుంటాయి. అందుకని కంటకారి అంటారు. ‘వాకుడు, గుర్రపుగట్టాకు’ లాంటి పేర్లు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో ఈ మొక్కకి విస్తృతమైన ప్రచారం వచ్చింది. ఈ ముళ్ల వంకాయల్ని ఎక్కడ కనిపించినా వదలకండి.
ముళ్ల వంకాయల్ని కూరగా వండుకోవచ్చు.
మొక్క మొత్తాన్ని శుభ్రం చేసి, పూర్తిగా ఎండబెట్టి, దంచిన పొడిని టీ కాచుకుని తాగవచ్చు.
కరోనా రాకుండా నివారించే శక్తి శరీరానికి కలగటానికి ఇది సహకరిస్తుంది.
పులి పంజాలా ముళ్లు కలిగింది కాబట్టి దీనికి ‘వ్యాఘ్రీ’ అనే మరో పేరుంది. అదే తెలుగులో వాకుడు అయ్యిందంటారు.
‘వ్యాఘ్రీ హరీతకీ అవలేహ్యం’ అనే ఔషధం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల్లో వాడతారు. పెద్దవాళ్లు ఒక చెంచా, పిల్లలు అర చెంచా మోతాదులో తీసుకుని, మిరియాల పాలు తాగితే బాగా పనిచేస్తుంది. మరీ చిన్నపిల్లలకు ఆయుర్వేద వైద్యుడి సలహాతోనే ఇవ్వాలి.
ఇగురు కూర
క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో ముళ్ల వంకాయలతో కూర తయారు చేసుకునే పద్ధతిని వివరించాడు. ముళ్ల వంకాయల్ని శుభ్రపరచుకుని, చిన్న ముక్కలుగా తరిగి, ఓ బాండీలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముక్కలు మెత్తపడేవరకూ ఉడికించండి. ముక్కలు చల్లారాక ఒక గుడ్డలో వేసి మూటకట్టి కర్రతోగానీ, పప్పుగుత్తితో కానీ, పచ్చడి బండతో కానీ గట్టిగా నొక్కి, నీరంతా బయటికి పోయేలా పిండేయండి. ‘దండాహతం’ అనే పదం ద్వారా క్షేమశర్మ ఈ విధంగా చెయ్యాలని సూచించాడు. సాధారణంగా ముళ్ల వంకాయలు చేదు, కారం రుచులతో కూడి ఉంటాయి. ఇలా ఉడికించి నీరు పిండేస్తే, ఆ చేదు పోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని నేతి తాలింపు పెట్టి, ‘చిరవిపాచిత మాజ్యమధ్యే’... అంటే ఎక్కువ సేపు ఆ నేతిలో మగ్గనివ్వాలన్నాడు. బాగా మగ్గిన తరువాత సైంధవ లవణం కలపాలన్నాడు. ఈ ముళ్ల వంకాయల ఇగురు కూర జఠరాగ్నిని పెంపు చేసేదిగా, జీర్ణశక్తిని కాపాడేదిగా ఉంటుందని, దగ్గు రాకుండా చేస్తుందని పేర్కొన్నాడు.
అర గరిటెడు చాలు
ముళ్ల వంకాయల ఇగురు కూరని అర గరిటెడు కన్నా ఎక్కువ కాకుండా తేలికగా తినటమే మంచిది. ఎందుకంటే, ఇది తీక్షణమైన ఔషధ ద్రవ్యం. శక్తివంతమైనది. ఉష్ణ స్వభావం కలిగింది కూడా. అందుకని దీన్ని చింతపండు, అల్లం, వెల్లుల్లి మసాలాలు కలిపి వండితే దాని ఉష్ణత్వం ఇంకా పెరుగుతుంది. వారానికి ఒకసారైనా ఇలాంటి కూరల్ని తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. పురుగు మందులు, విష రసాయనాలు, కల్తీలు, రోడ్డు పక్కన అమ్మే జంక్ ఆహార పదార్థాలవల్ల కలిగే విష దోషాల నుంచి శరీరం తనను తాను కాపాడుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
ఎన్నిటికో ఔషధం
ముళ్ల వంకాయ కాలేయం, గుండెను శక్తిమంతం చేస్తుంది.
షుగరు వ్యాధిని అదుపు చేస్తుంది.
దగ్గు, జలుబు, ఆయాసాల్ని పోగొడుతుంది.
వాపుల్ని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల్ని అదుపు చేస్తుంది.
మెదడు కణాలకు ఉత్తేజం కలిగిస్తుంది.
అల్జీమర్స్ లాంటి మరుపు వ్యాధులు, నరాల జబ్బుల మీద ఔషధంగా పనిచేస్తుంది.
మానసిక సమస్యలు, ఆందోళన, దిగులు లాంటివి దీనివల్ల తగ్గుతాయని, మైగ్రేన్ తలనొప్పి మీద బాగా పని చేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి.
గంగరాజు అరుణాదేవి