ATA: 'ఆటా'లో అమెరికన్ తెలంగాణ సొసైటీ సంస్థ విలీనం
ABN, First Publish Date - 2023-09-15T08:34:16+05:30
అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో భాగంగా వివిధ అమెరికా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం, ఇతర ఆటా సభ్యులు పాల్గొన్నారు.
NRI: అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో భాగంగా వివిధ అమెరికా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం, ఇతర ఆటా సభ్యులు పాల్గొన్నారు. 2024 జూన్‌లో అట్లాంటాలో జరుగనున్న 'ఆటా' మహాసభలకు సంబంధించి చేపట్టవలసిన వివిధ చర్యలు, అజెండాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఈ సమావేశం ప్రధాన అంశంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ సంస్థ ఆటాలో విలీనం అయ్యింది. 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ ఉత్సవాలకు రెట్టింపు ఉత్సాహంతో శ్రీకారం చుట్టింది. చరిత్రాత్మక వికాసంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆధికారికంగా అమెరికా తెలుగు సంఘంలో మమేకమైంది. దృఢమైన, ఏకీకృత సేవా సంస్థగా తెలుగు తల్లి సన్నిధిగా, ప్రవాసాంధ్రుల సేవా పెన్నిధిగా, అమెరికాలో ఆటా గమనం చరితార్థమవ్వగా ఈ విలీనం స్ఫూర్తిదాయకం.
ఈ అద్భుత అంశం అట్లాంటాలో జరిగిన ఆటా మూడో బోర్డు సమావేశంలో భాగంగా సగౌరవంగా ప్రకటించబడింది. పలు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుల ప్రజా సేవా సారథిగా ఘన చరితను కైవశం చేసుకుంటున్న ఆటా సంస్థతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సగౌరవంగా, ప్రకాశవంతంగా ప్రజ్వలింపచేస్తున్న సంస్థ అమెరికన్ తెలంగాణ సొసైటీ మమేకం. ఈ ఇరు మహోత్తర సేవా సంస్థల కలయిక పరస్పర సహకారాలతో సాంప్రదాయ, సాంస్కతిక, సాంఘిక, సామాజిక, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలతో అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలను ఆదరించనుంది.
ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ ఈ మహత్తర కలయిక ఎన్నో అత్యద్భుత సేవా కార్యక్రమాలకు నాంది అంటూ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ అధ్యక్షులు నరేందర్ చేమెర్ల మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం (ఆటా) సంస్థతో విలీనం ప్రవాసాంధ్రుల మరియు భావి భారతీయుల పట్ల సేవా సంకల్పానికి అసమాన బలం అని పేర్కొన్నారు. సెప్టెంబరు 9వ తేదీ సాయంత్రం జరిగిన ఆటా 'కిక్ ఆఫ్' కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మంది స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరవ్వగా ఆటా కన్వెన్షన్ లోగో మరియు కిక్ ఆఫ్ సాంగ్ ఆవిష్కరణ జరిగాయి.
అలాగే విరాళాల సేకరణ, అడ్హాక్ టీం ప్రకటన, కన్వెన్షన్ కోర్ కమిటీ సభ్యుల పరిచయం, అధ్యక్షులు మధు బొమ్మినేని ప్రోత్సాహభరిత ప్రసంగం వంటి పలు ప్రధాన అంశాలతో ఆటా 2024 కన్వెన్షన్ కై ముమ్మర సన్నాహాలతో అంకురార్పణ చేశారు. ఈ అడ్హాక్ బృందం సభ్యులుగా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు భువనేశ్ బూజాల, కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, ఇతర ఆటా విశిష్ఠ నాయక బృందాన్ని సభాముఖంగా ప్రకటించింది. భారతదేశంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జరుగనున్న ఆటా వేడుకలు 2023 డిసెంబరు నెలలో 10 నుండి 30 వరకు నిర్ణీతమయినవిగా ప్రకటించారు. ఆటా మరియు 18వ ఆటా మహాసభలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.ataworld.org ను సందర్శించవచ్చు.
Updated Date - 2023-09-15T08:38:43+05:30 IST