London: భార్యను చెక్క బ్యాట్‌తో కొట్టిచంపిన 79ఏళ్ల భారతీయ వ్యక్తి.. కోర్టు ఏం తేల్చిందంటే..
ABN, First Publish Date - 2023-08-02T13:14:33+05:30
79 ఏళ్ల బ్రిటిష్ సిక్కు (British Sikh) వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చెక్క బ్యాట్‌తో కొట్టిచంపేశాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు.
లండన్: 79 ఏళ్ల బ్రిటిష్ సిక్కు (British Sikh) వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చెక్క బ్యాట్‌తో కొట్టిచంపేశాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఈ ఏడాది మే 2వ తారీఖున జరిగింది. సోమవారం ఈ హత్య కేసు స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్ట్ (Snaresbrook Crown Court) లో విచారణకు వచ్చింది. భారత వ్యక్తి తన నేరాన్ని అంగీకరించడంతో సెప్టెంబర్ 29న అతనికి శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు లండన్‌లోని ఎల్మ్ పార్క్ పరిధిలోని కౌడ్రే వే ప్రాంతంలో తర్సమే సింగ్ (Tarsame Singh), మాయా దేవి (Maya Devi) దంపతులు నివాసం ఉంటున్నారు. మే 2వ తేదీన భార్యాభర్తల మధ్య ఏం వివాదం జరిగిందో తెలియదు కానీ, సింగ్ తన భార్య మాయా దేవి తలపై చెక్క బ్యాట్ (Wooden Bat) తో బలంగా కొట్టాడు. అంతే.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఆమె తల నుంచి భారీగా రక్తస్రావం అవుతోంది. దాంతో కంగారుపడిన సింగ్.. భార్యను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె ఎంతకులేవలేదు. శ్వాస కూడా ఆగిపోయినట్లు నిర్ధారించుకున్న అతడు వెంటనే వెళ్లి, రోమ్‌ఫోర్డ్ పోలీస్ స్టేషన్ (Romford police station) లో లొంగిపోయాడు. తన భార్య చంపేశానని చెప్పడంతో పోలీసులు అతడు చెప్పిన ఇంటి అడ్రస్‌కు వెళ్లి చూశారు. అక్కడ రక్తపుమడుగులో మాయా దేవి విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పోస్టుమార్టం రిపోర్టులో తలపై బలమైన గాయం కారణంగానే ఆమె చనిపోయినట్లు వచ్చింది. దాంతో సింగ్‌పై రోమ్‌ఫోర్డ్ పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి, జైలుకి తరలించారు. సోమవారం ఈ కేసు స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తర్సమే సింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం సెప్టెంబర్ 29న శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
Indian American: హిందీలో మాట్లాడడమే ఈ భారతీయ వ్యక్తి చేసిన తప్పు.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికన్ కంపెనీ
Updated Date - 2023-08-02T13:14:33+05:30 IST