Indian American: హిందీలో మాట్లాడడమే ఈ భారతీయ వ్యక్తి చేసిన తప్పు.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికన్ కంపెనీ
ABN, First Publish Date - 2023-08-02T10:27:57+05:30
చివరి దశలో ఉన్న తన బావతో హిందీలో వీడియో కాల్ మాట్లాడినందకు తనను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారని ఓ భారతీయ-అమెరికన్ ఇంజనీర్ (Indian-American Engineer) కోర్టుకెక్కారు.
ఎన్నారై డెస్క్: చివరి దశలో ఉన్న తన బావతో హిందీలో వీడియో కాల్ మాట్లాడినందకు తనను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారని ఓ భారతీయ-అమెరికన్ ఇంజనీర్ (Indian-American Engineer) కోర్టుకెక్కారు. ఈ విషయమై తాను పనిచేసిన సంస్థపై ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారాయన. అమెరికా రక్షణ రహస్యాలను బయటకు చేరవేస్తున్నారని తోటి ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కంపెనీ చర్యలకు ఉపక్రమించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిసినా, కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో గతేడాది అక్టోబర్ నుంచి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆయన వాపోయారు. తనను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలి లేదా తనకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరుతున్నారు. అసలేం జరిగిందంటే.. అనిల్ వర్ష్‌ణే (Anil Varshney) అనే 78 ఏళ్ల భారత వ్యక్తి హంట్స్‌విల్‌లోని 'పార్సన్స్ కార్పొరేషన్' సంస్థ (Parsons Corporation) లో 2011 నుంచి సిస్టమ్స్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. పార్సన్స్ సంస్థ అనేది రక్షణ, నిఘా, భద్రతాపరమైన విభాగాల్లో సేవలు అందిస్తోంది.
ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన అనిల్ డ్యూటీలో ఉండగా భారత్‌లోని ఆయన బావ కేసీ గుప్తా వీడియో కాల్ చేశారు. అవసానదశలో ఉన్న బావతో చివరిసారిగా మాట్లాడాలనే ఉద్దేశంతో రెండు నిమిషాల పాటు ఖాళీ గదిలోకి వెళ్ళి ఆయన హిందీలో ఆ వీడియో కాల్ మాట్లాడారు. అలా అనిల్ వీడియో కాల్‌లో హిందీ మాట్లాడటం విన్న ఓ శ్వేతజాతి ఉద్యోగి ఆయన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు పొరబడ్డాడు. అంతే.. తర్వాత క్షిపణి రక్షణ కాంట్రాక్టర్ అలబామా కార్యాలయంలో ఉన్న ఆయనకు ఉద్వాసన పలికింది. కంపెనీ వీడియోకాల్స్‌పై నిషేధం విధించకపోయినప్పటికీ, అనిల్ భద్రతపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అనిల్‌ను గూఢచారిగా అనుమానించింది. కంపెనీ అధికారులు ఆయన ఫైళ్లను, ఇతర సామాగ్రినీ కూలంకషంగా పరిశీలించినా నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో తనను మళ్లీ జాబ్‌లోకి తీసుకోవడం లేదా నష్టపరిహారం ఇవ్వాలంటూ అనిల్ కోర్టుకెక్కారు.
Shocking Incident: మెల్‌బోర్న్‌లో ఘోరం.. బర్త్‌డే నాడు భారతీయ టీనేజర్‌పై పాశవిక దాడి!
ఈ నేపథ్యంలో కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తు భారతీయ ఇంజనీర్.. యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జె. అస్టిన్‌పై అలబామా ఉత్తర జిల్లాలో పౌర హక్కుల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. "మిస్టర్ అనిల్ అత్యంత విశిష్టమైన ఇంజనీరింగ్ వృత్తిని ముగించడానికి ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అతను 78 ఏళ్ల భారతీయ అమెరికన్. చివరిదశలో ఉన్న తన బావమరిదితో హిందీలో మాట్లాడుతుండగా.. అతని శ్వేతజాతి సహోద్యోగి ఒకరు విన్నారు. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు తప్పుగా నివేదించిన తర్వాత ప్రతివాదులు అనిల్‌ను హఠాత్తుగా తొలగించారు" అని అనిల్ వర్ష్‌ణే తరుఫు న్యాయవాది వాదించారు.
NRI: పాపం.. ఎన్నారై టెకీ.. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన యువతి.. నిలువునా ముంచేసిన వైనం..
Updated Date - 2023-08-02T11:51:52+05:30 IST