Domestic workers: భారత ఎంబసీ కీలక సలహాలు.. గృహ కార్మికులుగా పనిచేసే మనోళ్లు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి కూడా..
ABN, First Publish Date - 2023-09-26T07:44:42+05:30
కువైత్‌లో డొమెస్టిక్ వర్కర్లు (Domestic workers) గా పనిచేసే భారతీయులకు రాయబార కార్యాలయం తాజాగా కీలక సలహాలు జారీ చేసింది.
కువైత్ సిటీ: కువైత్‌లో డొమెస్టిక్ వర్కర్లు (Domestic workers) గా పనిచేసే భారతీయులకు రాయబార కార్యాలయం తాజాగా కీలక సలహాలు ఇచ్చింది. దీనిలో భాగంగా భారత పౌరులు ఎవరైతే కువైత్‌లో గృహ కార్మికులుగా చేరుతున్నారో వారు తప్పనిసరిగా పాటించాల్సిన, తెలుసుకోవాల్సిన నిబంధనలను ఎంబసీ వివరించడం జరిగింది. కువైత్ గృహ కార్మిక చట్టాలు (లా నం. 68 ఆఫ్ 2015), సంబంధిత మంత్రివర్గ నిర్ణయాలు, కార్యనిర్వాహక నిబంధనలను అనుసరించి వీటిని రూపొందించినట్లు ఎంబసీ పేర్కొంది. వాటి ప్రకారం అక్కడ డొమెస్టిక్ వర్కర్లుగా పనిచేసే భారతీయ గృహ కార్మికులకు వర్తించే ప్రత్యేక నిబంధనలు ఇలా ఉన్నాయి...
* రాతపూర్వక ఉపాధి ఒప్పందం (అరబిక్ మరియు ఆంగ్లంలో) తప్పనిసరి.
* అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొన్న కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదు (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కువైత్లోని భారత డొమెస్టిక్ వర్కర్లకు సూచించిన కనీస వేతనం నెలకు 120 కువైటీ దినార్లు. మన కరెన్సీలో సుమారు రూ. 32వేలు).
* ఏ కోత లేకుండా చేరిన తేదీ నుండి ప్రతి నెలాఖరులో అంగీకరించిన వేతనం యజమాని చెల్లించాలి. ఒకవేళ అలా చెల్లించకపోతే ఆలస్యమైన ప్రతి నెలకు 10కేడీలు అదనంగా వర్కర్‌కు యజమాని చెల్లించాల్సి ఉంటుంది.
* వర్కర్లకు ఉచిత ఆహారం, దుస్తులు, వైద్యం, తగిన వసతి కల్పించాలి.
* అదనపు పనికి పరిహారం (చెల్లించని పక్షంలో పీఏఎం విచారణ జరిపి అంగీకరించిన వేతనానికి రెట్టింపు చెల్లించమని యజమానిని ఆదేశించవచ్చు).
* వారంలో ఒకరోజు చెల్లింపుతో కూడిన సెలవు. అలాగే వార్షిక సెలవులకు చెల్లింపులు.
* సర్వీస్ ముగింపు ప్రయోజనాలుగా ప్రతి సంవత్సరం సర్వీస్‌కు ఒక నెల వేతనం.
* ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే లేదా మానవ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి ప్రమాదకర పనిని డొమెస్టిక్ వర్కర్లకు యజమాని అప్పగించరాదు.
* గరిష్ట పని గంటలు రోజుకు 12 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
* గృహ కార్మికుల పాస్‌పోర్ట్/సివిల్ ఐడీని వారి అనుమతి లేకుండా యజమాని తమ వద్ద పెట్టుకోవడానికి వీల్లేదు.
Emirates Draw: ఈమె ఎంత అదృష్టవంతురాలు.. పని చేయకుండానే నెలనెలా రూ.5.65 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!
Updated Date - 2023-09-26T07:54:20+05:30 IST