UK: మహిళ కిడ్నాప్ కేసు.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు జైలు
ABN, First Publish Date - 2023-10-11T08:42:23+05:30
అత్యాచారం చేసే ఉద్దేశంతో మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్రిటన్ కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
మహిళ కిడ్నాప్ కేసులో బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్, అక్టోబరు 10: అత్యాచారం చేసే ఉద్దేశంతో మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్రిటన్ కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇంగ్లండ్ తూర్పు ప్రాంతంలోని లీసెస్టర్ నగరంలో నివసించే బాధితురాలు ఉద్యోగ విధులకు హాజరయ్యేందుకు ఈ ఏడాది జనవరి 16 తెల్లవారుజామున ఇంటి నుంచి బయటికి రాగా అజయ్ దొప్పలపూడి(27), విహార్ మంచాల(24), రాణా యెల్లంబాయ్(30) తమ కారును ఆమె ఎదుట ఆపారు. దీంతో ట్యాక్సీగా భావించిన ఆమె ఆ కారులో ఎక్కారు. కొద్దిసేపటికే కారు వేరే మార్గంలో వెళ్తోందని బాధితురాలు గుర్తించారు. 24 కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి, కారులోంచి బలవంతంగా కిందికి లాగారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎలాగోలా దగ్గరలోని ఒక రోడ్డుపైకి చేరుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలో కారు నంబరును గుర్తించారు. కారు రిజిస్ర్టేషన్‌లో పేర్కొన్న అడ్ర్‌సకు పోలీసులు చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడే ఉన్నారు. వారిని బాధితురాలు గుర్తించడంతో కోర్టులో ప్రవేశపెట్టారు. ఎవరైనా మహిళను కిడ్నాప్ చేసి లైంగిక వాంఛ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నిందితులు తెల్లవారుజామున కారులో సంచరిస్తున్నట్టు గుర్తించామని దర్యాప్తు అధికారి చెప్పారు. విచారణ జరిపిన కోర్టు గతనెల 11న ముగ్గురినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఒక్కొక్కరికీ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
Updated Date - 2023-10-11T08:44:22+05:30 IST