Eid Milad Un Nabi 2023: ప్రవక్త పుట్టిన దేశంలోనే వేడుకలకు దూరం
ABN, First Publish Date - 2023-09-30T06:58:41+05:30
మిలాద్ ఉన్ నబీ.. మొహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే ఈ రోజును చాలా దేశాల్లో ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. ప్రవక్త జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు.
సౌదీలో ‘మిలాద్ ఉన్ నబీ’ నై
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): మిలాద్ ఉన్ నబీ.. మొహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే ఈ రోజును చాలా దేశాల్లో ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. ప్రవక్త జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో మిలాద్ ఉన్ నబీ రోజున సెలవు ప్రకటిస్తారు. అయితే, ఇస్లాంకు పుట్టినిల్లు, ప్రవక్త జన్మస్థలం కూడా అయిన సౌదీ అరేబియాలో మాత్రం ప్రవక్త జన్మదినోత్సవాన్ని జరుపుకోరు. అక్కడ ఎలాంటి ఊరేగింపులు, సెలవులు ఉండవు. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైత్ తదితర గల్ఫ్ దేశాలు మాత్రం సెలవు ప్రకటించాయి. అరబ్ భాషలో మిలాద్ అంటే జన్మ.. నబీ అంటే ప్రవక్త అని అర్థం. ఇస్లాంలో లేని విధంగా ప్రవక్త జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మత ఆచారాలకు విరుద్ధం(బిదా) అని సౌదీ అరేబియాలోని అత్యధికులు పేర్కొంటారు. ప్రవక్త జన్మించిన దేశంలో లేని ఈ వేడుకలను జరుపుకోవడానికి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు సౌదీ అరేబియాకు వస్తుంటారు. దీంతో ఒక్క సారిగా విమాన టికెట్ ధరలు పెరిగిపోతుంటాయి. ప్రతి సంవత్సరం స్థానికంగా ఉండే అరబ్బుల కంటే పదింతలు ఎక్కువగా దక్షిణాసియా దేశాల నుంచి ముస్లింలు మిలాద్ ఉన్ నబీ రోజున మదీన పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. అయితే.. మొహమ్మద్ ప్రవక్త జన్మదిన నిర్ధారణకు సంబంధించి ఏ రకమైన ఆధారాలు లేవని ఇస్లామిక్ పండితుల అభిప్రాయం.
Updated Date - 2023-09-30T07:16:38+05:30 IST