Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!
ABN, First Publish Date - 2023-08-27T09:10:08+05:30
ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే.
ఎన్నారై డెస్క్: ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే. అయితే, ఇక్కడ మనోళ్లు కావాలని చేసినవి కంటే.. తెలియకుండా మోసపోయినవి ఎక్కువ ఉన్నాయి. తాజాగా వారి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తెలియక చేసిన పొరపాటు ఓ తల్లికి తన బిడ్డను, ఓ భార్యకు తన భర్తను ఏళ్ల తరబడి దూరం చేసింది. ఎవరిని కదలించిన కన్నీటి కథలే బయటకు వస్తున్నాయి. వీరిలో అత్యధికులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా కోజికోడ్‌లోని వట్టక్కినార్‌కు చెందిన 72 ఏళ్ల సి.వి. కున్హిబీ తన కుమారుడు మహ్మద్ షమీర్ (51) ఖతార్ జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థనలు చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయిన కున్హిబీకి దీర్ఘకాలిక రుమాటిక్ వ్యాధి ఉంది. దాంతో ఆమె కింది నుంచి కదలలేని పరిస్థితి. షమీర్ 30ఏళ్ల క్రితం చిన్న వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం ఖతార్ వెళ్లాడు. అక్కడ వచ్చే ఆదాయంతో ఇంట్లో భార్య, నలుగురు పిల్లలను పోషించేవాడు. గడిచిన నాలుగేళ్లుగా ఖతార్ జైలులో బందీ కావడంతో అతడి కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అలాగే కోజికోడ్‌లోని పావన్‌గాడ్ గ్రామానికి చెందిన అనుస్మృతి అరుణ్ భర్త కె. అరుణ్ ఒక ట్రేడింగ్ కంపెనీలో భాగస్వామిగా ఉండేవాడు. అయితే, చెక్ బౌన్సింగ్ కేసు కారణంగా నాలుగు సంవత్సరాలకు పైగా జైలులోనే గడుపుతున్నాడు. 2019లో వివాహం అయిన కొద్ది రోజులకే భర్త దూరం అయ్యాడని అనుస్మృతి కన్నీటిపర్యంతమవుతోంది.
ఇలా దాదాపు 500 మంది భారతీయ ప్రవాసులు (Indian Expats), ఎక్కువగా కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాల నుండి ఆర్థిక నేరాలకు ఖతారీ జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం వ్యాపారం కోసం భారతీయులు 49:51 ప్రాతిపదికన ఖతారీలతో భాగస్వామ్యం చేసుకోవచ్చు. కానీ, వాస్తవికంగా ఇది జరగడం లేదు. బాధ్యత మొత్తం భారతీయుల భుజాలపై పడుతోంది. వ్యాపారాలు విఫలమైనప్పుడు భారతీయులు చాలా నష్టపోతున్నారు. వారు తిరిగి చెల్లించలేని రుణాల భారం కారణంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
ఇదిలాఉంటే.. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. వీటిలో అత్యధికంగా 1,611 మంది ఖైదీలతో యూఏఈ (UAE) మొదటి స్థానంలో ఉంది. సౌదీ అరేబియాలో 1,461 మంది భారతీయ ఖైదీలు (Indian Prisoners) ఉన్నారు. అలాగే ఖతార్ 696 మందితో తదుపరి స్థానంలో ఉంది. ఇందులో ఇతర నేరాలకు అరెస్టయిన వ్యక్తులు కూడా ఉన్నారు.
Telugu Expats: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు ప్రవాసీ కుటుంబ సభ్యుల దుర్మరణం!
Updated Date - 2023-08-27T09:19:13+05:30 IST