Telugu Expats: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు ప్రవాసీ కుటుంబ సభ్యుల దుర్మరణం!
ABN, First Publish Date - 2023-08-26T13:36:09+05:30
సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అక్కడికక్కెడ దుర్మరణం చెందారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అక్కడికక్కెడ దుర్మరణం చెందారు. కువైత్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న దండు గౌస్ బాషా తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైత్ నుండి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని కారులో తిరిగి కువైత్‌కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ఆరు గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుండి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై ఒక ట్రాలను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు.
మృతుల పాస్ పోర్టులు, అఖమా (రెసిడెన్సీ వీసా)లు పూర్తిగా కాలిపోవడంతో వీరి గుర్తింపు ఒక దశలో పోలీసులకు కష్టంగా మారింది. పోలీసుల సహాయంతో సిద్దిఖ్ తువూరు అనే ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త వీరి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను సంప్రదించడంతో మృతుడు గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ళ క్రితం వీరి కుటుంబం మదనపల్లికి ఆ తర్వాత బెంగళూరులో స్ధిరపడినట్లుగా తెలిసింది. ఇక ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారి కుప్పకూలడంతో స్వస్ధలంలో ఆసుపత్రిలో చేర్పించనట్లుగా సమాచారం. తండ్రి కోలుకున్న తర్వాత అవసరమైన దస్త్రాలను పంపితే గానీ మృతుల అంతిమక్రియల ప్రక్రియ మోదలు కాదు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్ లేదా మృతదేహాలను భద్రపర్చిన అల్ రుమాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!
Updated Date - 2023-08-26T13:42:03+05:30 IST