AP BJP: 2009 ఎన్నికల బరిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఈ పెద్దాయన గుర్తున్నారా..!
ABN, First Publish Date - 2023-04-22T13:43:29+05:30
ప్రముఖ పారిశ్రామిక వేత్త గుంటూరు నగరానికి చెందిన తులసీ రామచంద్రప్రభు, ఆయన పెద్ద కుమారుడు తులసీ యోగీష్‌చంద్ర కమలం గూటిలో చేరారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో..
కమలం గూటికి తులసీ రామచంద్రప్రభు
కేంద్ర మంత్రి మురళీధరన్ సమక్షంలో చేరిక
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామిక వేత్త గుంటూరు నగరానికి చెందిన తులసీ రామచంద్రప్రభు, ఆయన పెద్ద కుమారుడు తులసీ యోగీష్‌చంద్ర కమలం గూటిలో చేరారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పేరొందిన రామచంద్రప్రభు గతంలో ప్రజారాజ్యంలో చేరి గుంటూరు పశ్చిమ నుంచి 2009 ఎన్నికల బరిలో దిగారు. ఆ నాడు కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కనుమరుగయ్యాక ఆయన టీడీపీలో చేరారు.
2014 ఎన్నికల్లో ఆయన తిరిగి టీడీపీ తరుపున పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన రామచంద్రప్రభును మంగళగిరి నుంచి బరిలోకి దించాలని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. ఒక దశలో ఆయన పేరును మంగళగిరికి ఖరారు చేశారు. అయితే స్థానికేతరుడిగా మంగళగిరి వెళ్ళి పోటీ చేయటానికి రామచంద్రప్రభు వెనుకాడారు. అయితే ఆ ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ కేవలం 12 ఓట్ల తేడాతోనే ఓటమి పాలైంది. తదనంతరం రామచంద్రప్రభు రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆయన బీజేపీలో చేరటం విశేషం.
Updated Date - 2023-04-22T13:43:29+05:30 IST