BRS : నాందేడ్ బహిరంగ సభావేదికగా కేసీఆర్ సంచలన ప్రకటన.. రానున్న ఎన్నికల్లో...
ABN, First Publish Date - 2023-02-05T16:57:43+05:30
జాతీయ రాజకీయాలే (National Politics) లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ను (BRS) విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా...
నాందేడ్ : జాతీయ రాజకీయాలే (National Politics) లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ను (BRS) విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో (Nanded) ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సభకు నాందేడ్ పట్టణంతో పాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. ఈ సభపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు స్వయంగా ఆయనే హాజరయ్యారు. దీంతో నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సభావేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. అంతేకాదు.. బీఆర్ఎస్ లక్ష్యమేంటి..? ఏమేం చేయాలని అనుకుంటోంది..? అనే విషయాలను నిశితంగా వివరించారు.
ప్రకటన ఇదే..
ఈ సందర్భంగా నాందేడ్ నుంచి సంచలన ప్రకటన చేశారు సీఎం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని (Maharastra) అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అయితే ఒంటరిగా పోరాటం చేస్తారా..? లేకుంటే ఏదైనా ప్రాంతీయ పార్టీతో కలిసి ముందుకెళ్తారా..? అనే విషయంపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు మహారాష్ట్రకు చెందిన నేతలు ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరూ కేసీఆర్‌ను కలవలేదు.. బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించలేదు కూడా. అయితే నాందేడ్ సభ రోజు మాత్రం మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. త్వరలోనే గ్రామ గ్రామాన బీఆరెస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల్లోనే గ్రామ కమిటీలు నియమిస్తాం. త్వరలో విదర్భలోనూ పర్యటిస్తాను. తెలంగాణలో రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటుదామని ప్రజలకు కేసీఆర్ పిలునిచ్చారు.
మన సర్కార్ రావాల్సిందే..
‘స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్ళు దాటినా అనేక చోట్ల నీరు, విద్యుత్తు దొరకడం లేదు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు (Suicide) ఎక్కువగా ఉన్నాయి. రైతుల గురించి ఎందుకు చర్చ జరగడం లేదు..?. రైతుల సమస్యలు పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Ab ki baar Kisan Sarkar) రావాల్సిందే. రైతుల సమస్యలు తీర్చడం చాలా చిన్న పని. ఈ విషయం పై నేను చెప్పింది నిజమా..? కాదా..? అనే చర్చ జరగాలి. దేశంలో నాయకులు గెలుస్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఓడిపోతున్నారు. ప్రపంచంలో భారతదేశం (India) ఆర్థికంగా శక్తి వంతమైన దేశం’ అని కేసీఆర్ తెలిపారు.
ప్రశ్నల వర్షం..!
‘దేశంలో ఎన్నో నదులు ఉన్నా ఉపయోగం సున్నా. 50 వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి. 75 ఏళ్లలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) వారు ఏం చేశారు..?. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నువ్వెంత అంటే నేనెంత అనుకుంటూ కాలయాపన చేశారు తప్ప దేశాన్ని పట్టించుకోలేదు. మేకిన్ ఇండియా (Make in India) అంటూ, దోకిన్ ఇండియాగా మార్చారు. దేశ అవసరాల కోసం చైనాపై (China) ఆధారపడాల్సిన పరిస్థితిని బీజేపీ (BJP) తీసుకొచ్చింది. దేశంలోని అన్ని పట్టణాలలో చైనా బజార్‌లు (China Bazar) వెలిశాయి’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-02-05T17:41:35+05:30 IST