Telangana Politics: ఖమ్మం గుమ్మంలో తెలంగాణ రాజకీయం.. పెద్ద కథే ఉందిగా..!
ABN, First Publish Date - 2023-01-17T20:13:05+05:30
తెలంగాణ రాజకీయానికి ఇప్పుడు ఖమ్మం (Khammam) కేంద్ర బిందువు అయింది. ఏ రకంగా చూసినా ఇప్పుడు ఖమ్మం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయానికి ఇప్పుడు ఖమ్మం (Khammam) కేంద్ర బిందువు అయింది. ఏ రకంగా చూసినా ఇప్పుడు ఖమ్మం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఏ ముహూర్తాన ఖమ్మంలో సభ నిర్వహించారో కానీ, అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలన్నీ ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి షర్మిల (YS Sharmila) పోటీ చేస్తానని ప్రకటించడం, చంద్రబాబు సభ సక్సెస్ కావడం, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనుండడం వంటి పరిణామాలతో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మంపై పడింది.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని ఖమ్మం పేరు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయింది. అకస్మాత్తుగా ఇప్పుడీ పేరు తెరపైకి ఎందుకు వచ్చింది? తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సహా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎందుకు ఈ పేరును పదేపదే పలవరిస్తోంది. తరచి చూడాలే కానీ ఇందుకు బోల్డన్ని కారణాలు కనిపిస్తాయి.
ఖమ్మంపై పట్టు కోసం బీఆర్ఎస్...
అధికారం చేపట్టిన తొలినాళ్లలో బీజేపీతో కొంతకాలం పాటు మైత్రి కొనసాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఆ తర్వాత కాషాయం పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బీజేపీ(BJP)కి పోటీ ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ ఎలానూ లేదు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని పట్టుదలగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తంగా చేసి చూపిస్తానంటూ తన టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్ఎస్ (BRS)గా మార్చేసి బాగానే హడావుడి చేశారు. అంతేకాదు, ఖమ్మం వేదికగా జనవరి 18న బీఆర్ఆర్ ఆవిర్భావ సభను కూడా నిర్వహిస్తున్నారు. దేశ రాజకీయాలకు తొలి అడుగు అక్కడి నుంచే ప్రారంభం అవుతుందంటూ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. భారీ స్థాయిలో నిర్వహించే ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, కేరళ సీఎం విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదతరులు ఈ సభకు హాజరుకాబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కావడంతో కేసీఆర్ ఇక్కడ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. సభ నేపథ్యంలో ఖమ్మం ఇప్పటికే గులాబీమయం అయింది. 100 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయగా, పార్కింగ్ కోసమే ఏకంగా 400 ఎకరాలు కేటాయిస్తున్నారు. సభా వేదిక ముందు వీఐపీల కోసం 20 వేల కుర్చీలను వేయిస్తున్నారు. 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలు సభకు హాజరుకాబోతున్నారు. ఈ సభతో బీఆర్ఎస్ పార్టీ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.
ఖమ్మంలోనే ఎందుకు?
హైదరాబాద్‌లాంటి నగరాన్ని వదిలేసి ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించడం వెనక ఏదైనా కారణం ఉందా? అంటే తప్పకుండా ఉందనే చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న రోజుల్లోనూ ఖమ్మంలో కేసీఆర్ ప్రభావం చూపించలేకపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మంలో విజయం సాధించిన పువ్వాడ అజయ్ కుమార్ ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కానీ, గత ఎన్నికల్లో కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ ప్రభావం చూపించలేకపోయింది. అయితే, గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీని కాదని టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్ ఆయనను గెలిపించుకున్నారు. మరోవైపు, నాయకత్వ లేమి, కుల, సామాజిక సమీకరణాలు, వర్గపోరు వంటివి జిల్లాలో బీఆర్ఎస్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో బలంగా ఉన్న పార్టీని ఖమ్మం మాత్రం కలవరపెడుతోంది. ఇక్కడ కేసీఆర్ సామాజిక వర్గానికి పట్టు లేకపోవడం, ఖమ్మంలో ఎక్కువమందికి ఆంధ్రా మూలాలు ఉండడం కూడా బీఆర్ఎస్ బలపడపోవడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో సామాజిక వర్గానికి అతీతంగా ఇక్కడి ప్రజలను తనవైపు తిప్పుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
ఖమ్మంపైనే గురిపెట్టిన షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)ని స్థాపించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలని భావిస్తున్న వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కూడా తన పోటీకి ఖమ్మం జిల్లానే ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించి చర్చకు తెరలేపారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. షర్మిల పాలేరును ఎంచుకోవడం వెనక కారణం కూడా ఉంది. పాలేరు రిజర్వాయర్‌కు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరమ్మతులు చేయించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు నిర్మించి అందించారు. ఇలా పాలేరుతో వైఎస్‌కు ఉన్న అనుబంధాన్ని రాజకీయ ప్రయోజనంగా మలుచుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఇక, గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు పాలేరు నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ను ఎదురొడ్డాలని షర్మిల నిర్ణయించారు.
ఖమ్మం సభతో తెలంగాణపై చంద్రబాబు ఫోకస్
తెలంగాణలో దాదాపు జీరో స్థాయికి వెళ్లిన టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని యోచిస్తున్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతేడాది డిసెంబరులో ఖమ్మంలో పర్యటించారు. ఈ సభకు జనం పోటెత్తారు. ఆ పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పెద్దగా జన సమీకరణ లేకుండానే జనం పోటెత్తారు. దీంతో చంద్రబాబు ఖమ్మం సభ రాజకీయాల్లో చర్చకు కారణమైంది. ఖమ్మంలో టీడీపీకి తొలి నుంచి గట్టి పట్టుంది. టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించి సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత చోటామోటా నాయకులు సహా అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ టీడీపీ ఖాళీ అయింది. ఇప్పుడ అక్కడ సభను సక్సెస్ చేయడం ద్వారా చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. అంతేకాదు, ఇతర పార్టీల్లో చేరిన టీడీపీ నేతలు తిరిగి రావాలని కూడా పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో యుద్ధం చేస్తున్న సమయంలో ఖమ్మంలో సభను విజయవంతం చేయడం ద్వారా బీజేపీకి దగ్గరై ఉమ్మడి శత్రువైన బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది. చంద్రబాబు ఖమ్మంలో కాలు పెట్టింది మొదలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి.
రేవంత్ కూడా అక్కడి నుంచే...
తెలంగాణలో టీడీపీ పరిస్థితే కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోంది. అయితే, ఆ పార్టీకి మరికొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. వర్గపోరు, సీనియర్లు, జూనియర్ల విభేదాలు, గ్రూపులు, మితిమీరిన ప్రజాస్వామ్యం వంటివి ఆ పార్టీని వేధిస్తున్నాయి. తెలంగాణ టీడీపీలో ఒకప్పుడు ప్రముఖ నేతగా ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత జోరు పెంచిన రేవంత్ రాష్ట్రంలో పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే, ఎటొచ్చీ ఆయనకు సీనియర్ల నుంచి సహకారం అందడం లేదు. నిజానికి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ పీసీసీ బాస్ అయ్యాక జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పటికీ పార్టీని సజీవంగా ఉంచడంలో విజయం సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయన కూడా ఖమ్మం నుంచే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారని, రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైందని చెబుతున్నారు. ఈ నెల 26 నుంచి ఆయన పాదయాత్ర ఉంటుందని సమాచారం.
Updated Date - 2023-01-17T22:56:08+05:30 IST