Komati Reddy: పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా.. సుధాకర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం..!
ABN, First Publish Date - 2023-03-08T12:16:32+05:30
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా సెన్సేషనే. కరుడు కట్టిన కాంగ్రెస్ ...
తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనే. నిత్యం హాట్ కామెంట్స్‌తో హీట్ పుట్టిస్తుంటారు. సీనియర్ నేత అయినప్పటికీ.. ఆయన వ్యవహరించే తీరు మాత్రం కాక రేపుతుంటుంది. తాజాగా.. సొంత పార్టీలోని ఓ నేతపై సంచలన వ్యాఖ్యలు చేసి పాలిటిక్స్‌ను షేక్ చేశారు. ఇంతకీ.. ఎవరా నేత?.. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలేంటి?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన వివాదం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా సెన్సేషనే. కరుడు కట్టిన కాంగ్రెస్ నేతగా పేరుగాంచి.. అదే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేసులో ఉండి.. ఆ పదవి పొందిన రేవంత్‌రెడ్డిపై పదేపదే కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న సోదరుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరినప్పటి నుంచి అందరిచూపులు ఆయనపైనే ఉన్నాయి. రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తుండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి ప్రత్యేక గ్రూప్ తయారైంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనడం లేదని అద్దంకి దయాకర్ చేసిన హాట్ కామెంట్స్‌పై వెంకట్‌రెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా
మరోవైపు... రేవంత్‌రెడ్డి.. తనను హోంగార్డు అన్నారని ఆయనపై ఫైర్ అవడంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. చివరికి.. ఆ తర్వాత.. ఓకే వేదికపై ఇద్దరూ కలిసి.. మాట్లాడుకోవడం జరిగింది. అయినా.. కథ కంచికి చేరకుండా మళ్ళీ మొదటికి వచ్చింది. పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతానని బాంబు పేల్చారు. తెలంగాణలో రాబోయేది.. హంగ్ సర్కార్ అని.. ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని.. హాట్‌కామెంట్స్ చేసి రచ్చకు తెరలేపారు. మళ్ళీ.. తన ఉద్దేశం.. అది కాదని ఆయనే ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఇక.. నకిరేకల్ శివారులో కోమటిరెడ్డి కోవర్ట్‌రెడ్డి అంటూ పోస్టర్లు వెలిసినా అంతగా పట్టించుకోని వెంకట్‌రెడ్డి.. అదే ప్రాంతానికి చెందిన చెరుకు సుధాకర్.. ఆయనపై వ్యతిరేకంగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో చూసి ఆగ్రహానికి లోనయ్యారు. చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసి.. ఆయన్ను చంపుతామని.. వంద వెహికిల్స్‌లో అభిమానులు తిరుగుతున్నారని.. వారం రోజుల్లో చంపేస్తారని.. ఆస్పత్రి ఉండదని బెదిరించిన కాల్ రికార్డ్ దుమారం రేపింది. పోలీస్ స్టేషన్లలో వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదులు, దిష్టిబొమ్మల దహనం చేసే పరిస్థితి ఏర్పడింది.
భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి!
ఇదిలావుంటే.. కాల్ రికార్డ్ దుమారంపై వెంకట్‌రెడ్డి స్వయంగా స్పందిస్తూ వీడియో పోస్ట్ చేశారు. తాను మాట్లాడిన మాటల్లో కొన్ని మాత్రమే లీక్ చేశారని, సుధాకర్ ఎందుకు తిడుతున్నారో అడిగి.. తిట్టవద్దని సుహాస్‌కు గట్టిగా చెప్పానన్నారు. తనను తిడితే అభిమానులు కోపంతో సుధాకర్‌ను చంపుతారన్న ఆందోళనతోనే హెచ్చరించడం జరిగిందన్నారు. ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదని, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు.. ఆ వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవని అర్థం చేసుకోవాలని, ఇకపై అలా ఆవేశపడి.. కామెంట్స్ చేయబోనని వెంకట్‌రెడ్డి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ఆలోచింపచేస్తోంది. అయితే.. ఎప్పుడూ ఎలాంటి కామెంట్స్‌పై సంజాయిషీ ఇవ్వని ఆయన.. చెరుకు సుధాకర్ విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మొత్తంగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆవేశంతో నిత్యం వార్తల్లో ఎక్కుతూ.. కాంగ్రెస్‌లో నిలకడలేని నేతగా మారడంపై ఆయన అభిమానులే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా.. స్పష్టమైన వైఖరితో ఉండాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. చెరుకు సుధాకర్‌పై హాట్‌కామెంట్స్ విషయంలో కాస్త ఆలోచించి వ్యవహరించిన వెంకట్‌రెడ్డి.. రాబోయే రోజుల్లోనూ అలానే ఉంటారా?.. లేదా?.. అన్నది చూడాలి మరి.
Updated Date - 2023-03-08T12:16:42+05:30 IST