MLC elections: ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..గెలుపు మాదంటే మాదంటూ ఎవరికివారు ధీమా..!
ABN, First Publish Date - 2023-03-08T11:39:09+05:30
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగుదేశం, వైసీపీ నేతలు.. మీరా?..
ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరింది. నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీల నాయకత్వం గెలుపు కోసం పావులు కదుపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు.. పట్టణాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. గెలుపు మాదంటే మాదంటూ ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపెవరిది?.. పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
పట్టభద్రుల ఓట్లు రెండొంతులు విశాఖలోనే
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగుదేశం, వైసీపీ నేతలు.. మీరా?.. మేమా?.. అనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి ఆయా పార్టీల నేతలు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలతోపాటు వార్డుల్లోనూ ఇంటింట ప్రచారం సాగిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతోపాటు ఉద్యోగ సంఘాలు పోటీ పడుతున్నాయి. పట్టభద్రుల ఓట్లు రెండొంతులు విశాఖలోనే ఉన్నప్పటికీ.. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోనూ.. ఏ ఒక్క ఓటూ మిస్ అవకుండా ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
జీతాల కోసం ఎదురుచూస్తూ అడుక్కోవాల్సిన దుస్థితి
వాస్తవానికి... ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నినాదం జనంలోకి బాగా వెళ్తోందనే టాక్ గట్టిగా నడుస్తోంది. జాబు క్యాలండర్ గురించి అడిగితే.. సాక్షి క్యాలండర్ ఇచ్చిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని.. టీడీపీ ప్రచారంలో.. పట్టభద్రులే స్వయంగా చెప్తుండడం వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న ఆలోచన ఏంటో తెలియజేస్తోంది. అలాగే.. ఉద్యోగులను అన్ని విధాలా ముంచేయడమే కాకుండా.. నెలనెలా జీతాలకు కూడా ఎదురుచూస్తూ.. అడుక్కోవాల్సిన దుస్థితి.. గతంలో ఏ ప్రభుత్వంలోనైనా చూశారా? అనే టీడీపీ నేతల ప్రశ్నలు.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా జగన్‌రెడ్డికి షాకిచ్చేలా ప్రతిపక్షాలు పక్కా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.
ప్రధానాంశాల్లో ఒకటిగా ఉద్యోగ, నిరుద్యోగ సంక్షేమం
ఇక.. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవరావును గెలిపించాలని మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, సుజయ్ క్రిష్ణరంగారావు, కిమిడి మృణాళిని పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అలాగే.. పార్టీ ప్రతినిధిగా విజయనగరం జిల్లాలో మకాం వేసిన మరో మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున కలసి పలువురు నేతలతో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే.. టీడీపీ అభ్యర్థికి ఓట్లు తెచ్చిపెడతాయని, రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, నిరుద్యోగ సంక్షేమం ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంటుందని ప్రచారం నిర్వహిస్తుండడం ఆకట్టుకుంటోంది.
మూడున్నరేళ్లలో ఏం చేశారనే ప్రశ్నలు
మరోవైపు.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యత సీనియర్ మంత్రి బొత్స సత్యన్నారాయణ భుజానకెత్తుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలసి విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక.. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. అయితే.. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రచారం చేస్తుండగా.. ఆ తర్వాత మాత్రం వైసీపీపై సెటైర్లు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లలో ఏం చేశారని ఓట్ల కోసం వస్తున్నారని ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలది వృథా ప్రయాసే తప్పా.. ఉపయోగం ఉండకపోవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. ఆ పరిణామాలు.. వైసీపీ నేతలనే కాదు.. ఆ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను కూడా ఉక్కపోతకు గురిచేస్తున్నాయి.
ఉత్తరాంధ్రాకు చేసింది శూన్యమనే వాదన
ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి మాధవ్ సునాయాసంగా గట్టెక్కారు. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితులు.. అందుకు పూర్తి భిన్నం. విభజన హామీలతోపాటు కేంద్ర ప్రభుత్వం.. ఏపీకి.. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రాకు చేసింది శూన్యమనే వాదన తెరపైకి వస్తోంది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పేరున్నప్పటికీ కమలం పువ్వు మాత్రం.. మాధవ్ భవిష్యత్‌ను వికసించకుండా అడ్డుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. పలు ప్రజా సంఘాలు రంగంలోకి దించిన పీడీఎఫ్ అభ్యర్థిని కోరడ్ల రమాప్రభ మాత్రం ప్రధాన పార్టీల మధ్య ఉనికి చాటుకుంటున్నారు. టీడీపీతో సమానంగా పోటీ పడుతున్నారు. దాంతో.. ఉద్యోగులు, నిరుద్యోగులు ఓట్లు వేస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంఘాలతో కలసి ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఆమె.. వైసీపీ వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నారు.
మొత్తంగా.. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టు.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. పార్టీ ఉనికి మీద సాగడం ఇబ్బందికరంగా ఉందనే వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే.. ఆ ప్రభావం.. వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. ఇక.. తమకెవరూ పోటీ కాదు.. గెలుపుకి కూతవేటు దూరంలో ఉన్నామని టీడీపీ చెబుతుంటే.. ఆ అవకాశమేదో తమకే దక్కుతుందనే ఆశలపల్లకిలో పీడీఎఫ్ అభ్యర్థితోపాటు వైసీపీ, బీజేపీ కూడా విహరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏదేమైనా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి..
Updated Date - 2023-03-08T11:41:46+05:30 IST