Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!
ABN, First Publish Date - 2023-04-09T23:05:26+05:30
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరు తెగ వినిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ (Congress) వాది అయిన ..
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరు తెగ వినిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ (Congress) వాది అయిన కిరణ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని కార్యకర్తలు, అభిమానులు కలలో కూడా ఊహించని రీతిలో కాషాయ తీర్థం ( BJP) పుచ్చుకోవడంతో అందరూ ఈయన గురించే చర్చించుకుంటున్నారు. అసలు కిరణ్‌ను బీజేపీలో చేరేలా ఒప్పించిందెవరు..? అసలు కాంగ్రెస్‌కు పూర్తి విరుద్ధమైన బీజేపీ వైపు అడుగుపడేలా చేసిందెవరు..? అసలు ఈ చేరిక వెనుక కథ మొత్తం నడిపిందెవరు..? అనే విషయాలు తెలుసుకోవడానికి అటు బీజేపీ నేతలు.. ఇటు కాంగ్రెస్ నేతలు అంతకుమించి ఔత్సాహికులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ తెరవెనుక ఉన్నదెవరు..? ఎందుకు ఆయన బీజేపీ కండువా దగ్గరుండి కప్పించారనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఎలా సాధ్యమైందబ్బా..?
ఒకానొక టైమ్‌లో కాంగ్రెస్ అంటే నల్లారి కుటుంబం (Nallari Family) .. నల్లారి అంటే కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. నల్లారి అమర్‌నాథ్ రెడ్డి (Nallari Amarnath Reddy) కాంగ్రెస్ హయాంలో ఒకే ఒక్క సీఎం సీటు తప్ప అన్నీ కీలక పదవులూ అనుభవించారు. ఆ సీఎం సీటు కూడా అడుగు దూరంలోనే మిస్సయ్యింది. అప్పట్లో ఇందిరాగాంధీ (Indira Gandhi) , పీవీ నర్సింహారావు (PV Narasimha rao) ఎవరు ఏపీకి వచ్చినా సరే కచ్చితంగా నల్లారి ఇంటికెళ్లేవారు.. అక్కడే భోజనాలు చేసేవారు. అలా కాంగ్రెస్ పెద్దలందరితోనూ నల్లారి కుటుంబానికి మంచి సన్నిహిత్యం ఉండేది. ఆయన తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన కిరణ్ రెడ్డి కూడా నిన్న, మొన్నటి వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే తండ్రికి సాధ్యంకాని సీఎం పదవిని కూడా కిరణ్ అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్ విభజానంతరం మధ్యలో జై సమైక్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి మళ్లీ కాంగ్రెస్‌లోకి విలీనం చేసి సొంత గూటికే చేరుకున్నారు. అలాంటి వ్యక్తి సడన్‌గా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇదెలా సాధ్యమైంది..? అని అనుచరులు, కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి చాలారోజులుగా కిరణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇలా ఉన్నట్టుండి ఢిల్లీకెళ్లడం, కాషాయ కండువాతో ప్రత్యక్షం కావడంతో ఆయన ఆప్తులు కూడా ఊహించని పరిణామం అని చెప్పుకుంటున్నారు.
ఆయనెవరో కాదండోయ్..!
కిరణ్ కాషాయ తీర్థం పుచ్చుకోవడం వెనుక రాయలసీమకు చెందిన బీజేపీ ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) కీలకపాత్ర పోషించారు. కిరణ్‌కు విష్ణుకు (Kiran-Vishnu) మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఉద్యమాల్లో కూడా పనిచేశారు. అప్పుడు ఈ ఇద్దరి స్నేహం మరింత పెరిగింది. రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన తన ఆత్మీయుడు ఇప్పుడిలా ఉండిపోవడం విష్ణుకు నచ్చలేదట. అందుకే అప్పటికప్పుడు ఆయనతో చర్చించి.. ఒప్పించడం అన్నీ గంటల్లోనే జరిగిపోయాయట. బీజేపీలో చేరితో కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని.. మీ లాంటి నాయకుల అనుభవాలు, సేవలు పార్టీకి కావాలని కిరణ్‌కు చెప్పారట. రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా జాతీయస్థాయిలో మంచి పదవి కూడా ఉంటుందని బీజేపీ పెద్దలతో మాట్లాడి మరీ హామీ ఇచ్చారట. సరిగ్గా ఇదే సమయంలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కిరణ్ అనుకోవడం అలా అన్నీ చకాచకా జరిగిపోయాయట. విద్యార్థి దశ నుంచే విష్ణు ఏబీవీపీలో పనిచేయడం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఈయనకు జాతీయస్థాయిలో పెద్దలతోనే పరిచయాలున్నాయి. అమిత్ షా, జేపీ నడ్డా లాంటి పెద్దలను అపాయిట్మెంట్ అవసరం లేకుండానే కలిసేంత చనువు ఉందని విష్ణు అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే నేరుగా కిరణ్ తీసుకెళ్లి కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీలో చేర్చడం.. అదే రోజు నడ్డాతో, ఆ మరుసటి రోజు షాతో మీటింగ్ ఏర్పాటు చేయడంలోనూ మొత్తం అన్నీ విష్ణునే చూసుకున్నారు. కిరణ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పెద్దలు త్వరలోనే కీలక పదవి ఇస్తారని.. రానున్న ఎన్నికల్లో రాయలసీమ నుంచే బరిలోకి దింపాలని కూడా భావిస్తున్నారట.
మొత్తానికి చూస్తే.. కిరణ్ రెడ్డిని దగ్గరుండి విష్ణు కాషాయ కండువా కప్పించారు. మరి ఆయనకు ఎలాంటి పదవిని బీజేపీ కట్టబెడుతుందో.. ఆయన సేవలను ఎలా ఉపయోగించుకుంటుందో అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
*****************************
ఇవి కూడా చదవండి..
*****************************
Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?
*****************************
Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?
*****************************
Updated Date - 2023-04-09T23:13:57+05:30 IST