Bandi Sanjay : 8 గంటల ఉత్కంఠకు తెర.. ఫైనల్‌గా బండి సంజయ్‌కు బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-04-06T22:41:59+05:30 IST
ఒకటా రెండా 8 గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం రాత్రి 10 : 20 గంటలకు తెరపడింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో
ఒకటా రెండా 8 గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం రాత్రి 10 : 20 గంటలకు తెరపడింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను బండికి హన్మకొండ న్యాయస్థానం మంజూరు చేసింది. సంజయ్‌కు బెయిల్ ఇవ్వాలని హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌కు బండి తరఫు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. అటు పోలీసులు కూడా బండిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీంతో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి ఆఖరికి గురువారం రాత్రి 10:20 గంటలకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు, బండి సంజయ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
రిలీజ్ ఎప్పుడు..?
ఇవాళ మొత్తం బండి సంజయ్ బెయిల్ గురించే ఎక్కడ చూసినా చర్చ జరిగింది. 8గంటలపాటు సాగిన ఈ విచారణలో చివరికి సంజయ్ లాయర్ల వాదనలతో హన్మకొండ న్యాయస్థానం ఏకీభవించినది. బెయిల్‌పై నిర్ణయాన్ని మొత్తం మూడుసార్లు మెజిస్ట్రేట్ వాయిదా వేసింది. చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్అనిత రాపోలు బెయిల్ మంజూరు చేశారు. రాత్రిపూట రిలీజ్ చేసేందుకు వీలుండదు కాబట్టి.. శుక్రవారం నాడు జైలు నుంచి బండి సంజయ్ రిలీజ్ కానున్నారు. అయితే సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని బండిని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం ఇలా..!
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ (Bandi Sanjay) లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు (Hanumakonda Court) డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41ఏ నోటీస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని అడిగింది. లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతిచ్చింది.