Kerala Women Lottery: నిన్నటిదాకా వీళ్లని ‘చెత్త’గా చూశారు.. ఇప్పుడేమో రూ.25 లతో కోట్లు సంపాదించారు!

ABN , First Publish Date - 2023-07-28T21:42:51+05:30 IST

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా అవతరిస్తుంటారు. కానీ.. ఇలాంటి అద్భుతాలు పుష్కరాలకోసారి మాత్రమే...

Kerala Women Lottery: నిన్నటిదాకా వీళ్లని ‘చెత్త’గా చూశారు.. ఇప్పుడేమో రూ.25 లతో కోట్లు సంపాదించారు!

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా అవతరిస్తుంటారు. కానీ.. ఇలాంటి అద్భుతాలు పుష్కరాలకోసారి మాత్రమే వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు కేరళలలోనూ ఇలాంటి వండర్ ఒకటి చోటు చేసుకుంది. ఒక లాటరీ 11 మహిళల తలరాతని మార్చేసింది. చెత్త ఏరుకుంటూ జీవనం కొనసాగించే వాళ్లు.. ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. చందాలేసుకుని రూ.250 విలువ గల లాటరీ కొనుగోలు చేయగా.. వారికి రూ.10 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. మలప్పురంలోని పరప్పనంగడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళలు చాలా పేదవారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వీళ్లవి. ఎంత కష్టపడినా తమ తలరాతలు మారడం లేదు కాబట్టి, లాటరీ కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఈ 11 మంది మహిళలు కలిసి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే.. ఆ లాటరీ టికెట్ ఖరీదు రూ.250. ఒక్కొక్కరి వద్ద అంత డబ్బు లేకపోవడంతో, తలో రూ.25 చందా వేసుకొని లాటరీ కొనాలని నిర్ణయించుకున్నారు. అలా అందరూ కలిసి రూ.250 జమ చేసి, ఆ లాటరీ టికెట్ కొన్నారు. ఈ లాటరీ తగిలితే, తమ జీవితాలు మారిపోతాయని.. దానిపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కట్ చేస్తే.. వారం రోజుల తర్వాత పాలక్కడ్‌కు చెందిన ఒకరికి రూ.10 కోట్ల లాటరీ తగిలినట్టు ప్రకటన వచ్చింది. ఎవరా అని ఆరా తీస్తే.. ఈ 11 మంది మహిళల సమూహమేనని తేలింది. దీంతో.. వాళ్లందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మొత్తానికి.. తాము పెట్టుకున్న ఆశలు ఫలించాయని, చాలా సంతోషించారు. చెత్త ఏరుకుంటూ ఇన్నాళ్లూ బతుకీడ్చిన ఈ మహిళలు.. ఇప్పుడు ఈ లాటరీ రూపంలో అదృష్ట దేవత వరించడంతో కోటీశ్వరులుగా మారారు. ఈ 11 మంది మహిళల్లో ఒకరైన రాధ.. తాము ఇలా చందాలేసి టికెట్లు కొనడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ చాలా టికెట్లు కొన్నామని వెల్లడించింది. కానీ.. ఇంత భారీ మొత్తం గెలవడం ఇదే మొదటిసారి అని పేర్కొంది.

Updated Date - 2023-07-28T21:42:51+05:30 IST