Mango man: ఒక్క మామిడిచెట్టుకు 300రకాల పండ్లు.. 7వతరగతి ఫెయిలైన ఈ తాత అద్బుతమే చేశాడు..

ABN , First Publish Date - 2023-03-14T16:19:28+05:30 IST

చెట్టు ఆకుల దగ్గర నుండి పూలు కాయలు వరకు మొత్తం వేరు వేరు వాసన వస్తుంటే..

Mango man: ఒక్క మామిడిచెట్టుకు 300రకాల పండ్లు.. 7వతరగతి ఫెయిలైన ఈ తాత అద్బుతమే చేశాడు..

ఒకమామిడి చెట్టుకు ఎన్నిరకాల కాయలు కాస్తాయి? మన ప్రాంతాలలో తోటలలో అయితే ఒకే రకం కాయలుంటాయి. కొన్ని చోట్ల నూతన పద్దతులలో ఒకటి నుండి నాలుగైదు రకాల పండ్లు కాస్తాయేమో కానీ ఏకంగా 300రకాల కాయలు కాస్తే.. చెట్టు ఆకుల దగ్గర నుండికాయలు పూల వరకు మొత్తం వేరు వేరు వాసన వస్తుంటే.. వినడానికి అంతా వింతగా అనిపిస్తుంది కానీ ఇదంతా నిజం. 7వ తరగతి ఫెయిల్ అయిన 83ఏళ్ళ ఈ తాత శాస్త్రవేత్తలకే సవాల్ విసిరాడు. ఈ మామిడి చెట్టు గురించి.. తాత గురించి వివరంగా తెలుసుకుంటే..

వేసవి గురించి ఎంత చిరాకు పడినా వేసవిలోనే లభించే పండు, పండ్లకు రారాజు అయిన మామిడిపండు అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow) నుండి 40కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్(Malihabad) అనే ఊరు ఉంది. ఇక్కడ 83ఏళ్ళ హాజీ కలీముల్లా అనే తాత ఉన్నాడు. హాజీ కలీముల్లా తాత 7వ తరగతి ఫెయిల్ కావడంతో తన తండ్రితో కలసి నర్సరీకి వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఆయనకు చెట్ల మీద ఆసక్తి పెరిగింది. 1957లో 7రకాల మామిడి పండ్లు కాసే చెట్టును అభివృద్ది చేశాడు. కానీ ఆ చెట్టు 1960 సంవత్సరంలో అక్కడ వచ్చిన వరదల ధాటికి నాశనమైంది. పాపం ఆయన ఆ వరదల సమయంలో ఆ చెట్టును కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యం కాలేదు. దీని తరువాత ఇంట్లో పేదరికం ఛాయలు అలముకున్నాయి. మరొక వైపు పెళ్ళి జరిగింది. ఇల్లు గడవడానికి కూలి పని చేసేవాడు. కుటుంబం అంతా షెడ్ లో నివసించేది. ఆ తరువాత 27ఏళ్ళు ఆయన తన జీవిత పోరాటంలో మునిగిపోయాడు. అన్నేళ్ళు గడిచినా ఆయనకు చెట్ల మీద ప్రేమ తగ్గలేదు.

1987సంవత్సరంలో కలీముల్లా స్నేహితుడు భోపాల్ వెళ్ళిపోతూ తనకున్న 5ఎకరాల భూమిని కలీముల్లాకు కౌలుకు ఇచ్చి వెళ్లాడు. ఆ భూమిలో కలీముల్లా నర్సరీని ప్రారంభించాడు. 13 ప్రత్యేకమైన మామిడి చెట్లను అభివృద్ది చేశాడు. దీంతోపాటు 300రకాల మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాసేలా చెట్టును అభివృద్ది చేశాడు. ఈ చెట్టును అభివృద్ది చేయడానికి ఈయనకు అక్షరాలా 18సంవత్సరాలు పట్టింది. ఈ చెట్టును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ చెట్టుకు కాసే పండ్లు కూడా సాధారణ పండ్లకంటే ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉంటాయి. దీనిలో మరిన్ని రకాల మామిడి పండ్లు కాసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 1991లో ఈ చెట్టు 33రకాల మామిడి పండ్లను కాసేది. కలీముల్లా ఒక్కో రకం పండుకోసం ఫార్ములా ప్రయోగించడం, అది సక్సెస్ కావడంతో ఈరోజు 300రకాల పైన మామిడి పండ్లు ఒక్కచెట్టుకే కాస్తున్నాయి. ఈయన సొంతంగా అభివృద్ది చేసిన మామిడి చెట్లకు భలే పేర్లు పెట్టాడు. ఐశ్వర్య, నమో(నరేంద్ర మోడీ), అబ్దుల్ కలాం, టెండూల్కర్, అమితాబ్.. ఇలా సెలబ్రిటీల పేర్లతో వీటికి ఆదరణ బాగుంది.

double.gif

గొప్ప గొప్ప శాస్ర్తవేత్తలకు ధీటుగా కలీముల్లా చేసిన ప్రయోగాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈయన కృషికి 2008లో పద్మశ్రీ అవార్డు లభించింది. అదే సంవత్సరం ఉద్యాన్ పండిట్ అవార్డు కూడా ఈయన అందుకున్నారు. ఆసియాలోని 100మంది పరిశోధకులలో కలీముల్లా తాత కూడా ఉన్నాడు. యూఏఈ, ఇరాన్ వంటి దేశాలు కలీముల్లా తాతయ్యను గౌరవించాయి. 2002లో దుబాయ్ లో 10తులాల బంగారు బిస్కెట్ తో కలీముల్లా తాతను సన్మానించారు. ఈయన అభివృద్ది చేసిన ఒక మామిడి చెట్టు చాలా వింతగా ఉంది. దీనికి కాసే పండ్లలో ఒకదానిపై ఒకటి రెండు తొక్కలు ఉంటాయి. లోపల 2 టెంకలు ఉంటాయి. అలాగే పండు లోపల రెండు రంగులలో ఉంటుంది. ఇది రుచి కూడా రెండురకాలు ఉంటుంది. అదొక కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. అది మరొక అద్భుతం. ఇతర దేశాల నుండి కలీముల్లా తాత అభివృద్ది చేసిన మామిడి చెట్లు, ఆ పండ్లు చూడటానికి పరిశోధకులు వస్తూనే ఉంటారట. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసిన కలీముల్లా తాత 300రకాల మామిడి చెట్టు ఫార్ములాను తను చనిపోయేముందు ప్రధాని మోదీకి మాత్రమే చెబుతానని అంటున్నాడు.

Read also: అప్పుచేసి ఎడిటింగ్ నేర్చుకుని.. 7ఏళ్ళు ఉద్యోగం కోసం కాళ్శరిగేలా తిరిగాడు.. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ లో భాగమయ్యాడు..


Updated Date - 2023-03-14T16:25:55+05:30 IST