Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా.. మెమొరబల్ ట్రిప్ కావాలంటే ఈ ప్రాంతాలు చూడండి..
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:29 PM
Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా.. మీ ట్రిప్ జీవితంలో మరపురాని అందమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోవాలంటే ఈ ప్రదేశాలు చూసేయండి. ఈ సుందరమైన ప్రాంతాల్లో స్నేహితులతో సాహసయాత్ర చేశారంటే.. ఆ థ్రిల్ ఇంకెక్కడా దొరకదు..

Treking Plan With Friends : స్నేహితులతో కలిసి సరదాగా చేసే యాత్ర చిరస్మరణీయంగా ఉండాలంటే సరైన ప్రదేశాలు ఇవే. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, స్వచ్ఛమైన గాలి మీలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని నింపి ఎనర్జిటిక్‌గా మారుస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలపై స్నేహితులతో యాత్ర ట్రెక్కింగ్ చేస్తుంటే ఉంటుంది.. ఆ థ్రిల్లే వేరు. ఇక్కడ కనిపించే ఆశ్చర్యకరమైన ప్రకృతి గీసిన వర్ణచిత్రాలు, సాహసయాత్రలు మీ స్నేహితులతో జీవితకాల మధురానుభూతులను పంచడం ఖాయం. భారతదేశంలో హిమాలయాల నుంచి పశ్చిమ కనుమల వరకూ ఉన్న అద్భుత ట్రెక్కింగ్ గమ్యస్థానాల వివరాలు మీ కోసం..
1. లక్కిడి వ్యూ పాయింట్
భారతదేశంలోని కేరళలో ఉన్న లక్కిడి వ్యూ పాయింట్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల మధ్య ఉన్న ఈ ప్రాంతం ట్రెక్కింగ్, హైకింగ్, ఫోటోగ్రఫీకి అనువైన ప్రదేశం. వయనాడ్‌లోని ఆకుపచ్చగా మెరిపోతూ కనిపించే అందమైన ప్రదేశాల్లో లక్కిడి వ్యూ పాయింట్ కూడా ఒకటి. స్నేహితులతో కలిసి ఇక్కడ ట్రెక్ చేయడాన్ని తప్పక ఆస్వాదిస్తారు. సమీపంలోని లక్కిడి వర్షారణ్యం, పూకోడ్ సరస్సు, చైన్ ట్రీలు సందర్శించడం మర్చిపోకండి.
2. లోహగడ్ ఫోర్ట్ ట్రెక్
లోహగడ్ ఫోర్ట్ ట్రెక్ భారతదేశంలోని మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం. 14వ శతాబ్దం నాటి ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. అత్యంత సుందరమైన దృశ్యాలకు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,033 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోటకు చేరుకోవాలంటే గడ్డి భూములు, చిన్న, పెద్ద రాళ్ళు, కఠినమైన మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. సహ్యాద్రి పర్వతాలు, చుట్టుపక్కల లోయల్లో అద్భుతమైన దృశ్యాల నడుమ స్నేహితులతో కలిసి ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కోటపై నుంచి పరిసర ప్రాంతాలను చూసిన తర్వాత ప్రకృతి అందాలకు ఎవరైనా దాసోహం అనాల్సిందే. అందమైన ప్రకృతి పూర్తిగా ఆస్వాదించాలంటే జూన్- సెప్టెంబర్ మధ్య ఈ ప్రాంతంలో పర్యటించండి. సౌకర్యవంతమైన బూట్లు, దుస్తులు, నీరు, స్నాక్స్, సన్‌స్క్రీన్ మీ వెంట ఉంచుకోవడం మర్చిపోకండి.
3. నీలిమల వ్యూ పాయింట్
కేరళలోని వయనాడ్‌లో ఉన్న నీలిమల వ్యూ పాయింట్ బెంగళూరు నుండి దాదాపు 282 కి.మీ దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల మధ్య ఉన్న నీలిమల వ్యూ పాయింట్ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ట్రెక్కింగ్, హైకింగ్, ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి. ఇక్కడి పచ్చని దృశ్యాలు, లోయలు, పర్వతాలు, మీన్‌ముట్టి జలపాతాలు, చెంబ్రా శిఖరం, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే సుదూర ప్రాంతాల నుంచి రిలాక్సేషన్ కోసం ఇక్కడి వచ్చి గడుపుతారు ప్రకృతి ప్రేమికులు. నీలిమల వ్యూ పాయింట్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.
4. సింహగడ్ ఫోర్ట్ ట్రెక్
భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే సమీపంలో సింహగడ్ కోట ఉంది. సముద్ర మట్టానికి2 వేల అడుగుల ఎత్తులో ఉన్న సింహగడ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ పూణేలోని డోంజే గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ట్రెక్కింగ్ సమయంలో మీరు అందమైన జలపాతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను దగ్గరగా చూసి తనివితీరా ఆస్వాదించవచ్చు. 6-9 కిలోమీటర్ల పాటు ట్రెక్ చేస్తూ ఈ కోటకు చేరాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఎక్కువగా వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు.
5. కెమ్మనగుండి ట్రెక్
కర్ణాటకలోని చిక్కమగళూరులో ఉన్న కెమ్మనగుండిలో ఒకసారి ట్రెక్కింగ్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు. కెమ్మనగుండిని ఏ సీజన్‌లోనైనా సందర్శించవచ్చు. కానీ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య వెళితే అద్భుత అనుభూతి కలుగుతుందని అంటారు. సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో.. నిటారుగా ఉన్న కెమ్మనగుండి కొండను ఎక్కేందుకు దాదాపు 45 నిమిషాలు పట్టవచ్చు. దట్టమైన పచ్చటి అడవులు, గడ్డి భూములు, అందమైన ఘాట్ల గుండా ఈ ప్రాంతానికి స్నేహితులతో కలిసి ప్రయాణించడాన్ని తప్పక ఆస్వాదిస్తారు.
Read Also :మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..
కొండల్లో తప్పిపోయి.. 10 రోజుల పాటు టూత్‌పేస్ట్ మాత్రమే తిని..
AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్