Swiggy: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. భారీ షాకిచ్చేందుకు రెడీ అయిందా..?
ABN , First Publish Date - 2023-01-20T15:54:36+05:30 IST
ఖర్చులను తగ్గించుకనే పనిలో భాగంగా పలు ప్రధాన కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అమెజాన్, గోల్డ్‌మన్ , మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీలు.. తమ ఉద్యోగుల్లో..
ఖర్చులను తగ్గించుకనే పనిలో భాగంగా పలు ప్రధాన కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అమెజాన్ (Amazon), గోల్డ్‌మన్ (Goldman), మైక్రోసాఫ్ట్ (Microsoft) సహా పలు కంపెనీలు.. తమ ఉద్యోగుల్లో చాలా మందిని పక్కన పెట్టేశాయి. ప్రస్తుతం ఈ కంపెనీల జాబితాలోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ కూడా చేరిపోయింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటూ నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ సీఈవో తెలిపారు.
స్విగ్గీలో (Swiggy) ప్రస్తుతం 6వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. స్విగ్గీ తమ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 380 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ శ్రీహర్ష మాజేటి (Sriharsha Majety) అధికారికంగా ప్రకటించారు. ఉద్యోగులను తొలగించాలనేది అమ ఉద్దేశం కాదని, అయితే కంపెనీ పునర్నిర్మాణాత్మక చర్యల్లో భాగంగా విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే వారిని ఆర్థికంగా ఆదుకునేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరిన్ని కొత్త వ్యాపార అవకాశాలపై అన్వేషణ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న కొన్ని కొత్త వర్టికల్స్‌పై కూడా కంపెనీ దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలో మాంసం సరఫరాను కూడా నిలిపేసి, ఇన్‌స్టామార్ట్ ద్వారా డెలివరీని కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు స్విగ్గీ సీఈవో శుక్రవారం.. తమ కంపెనీ ఉద్యోగులందరికీ ఇమెయిల్ (Email) పంపారు. కాగా, స్విగ్గీలోని ఉత్పాదక, ఇంజినీరింగ్, ఆపరేషన్ విభాగాల ఉద్యోగులనే ఎక్కువగా తొలగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022 అక్టోబర్‌లో స్విగ్గీ తమ కంపెనీ పని తీరు సమీక్షను పూర్తి చేసింది. అయితే పలు విభాగాలకు చెందిన ఉద్యోగులను పని తీరు మెరుగుదల ప్రణాళిక కింద అలాగే ఉంచారు. అడ్వర్టైజింగ్ మరియు ప్రమోషపనల్ ఖర్చులు కూడా నాలుగు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్‌లో 250మంది ఉద్యోగులను తొలగించబోతోందంటూ వార్తలొచ్చాయి. అయితే, ఉద్యోగుల పనితీరును బేరీజు వేసిన ప్రతిసారీ లేఆఫ్‌లు (Layoff) అనేవి సాధారణంగా జరుగుతుంటాయని స్విగ్గీ కంపెనీ అధికారులు పేర్కొన్నారు.