Indian Railway: ఇలాంటోళ్లను అసలేం చేయాలి..? రైల్వే పట్టాలపై ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకమేంటో చూస్తే..!
ABN, First Publish Date - 2023-11-10T17:31:54+05:30
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా దాన్ని వీడియోల రూపంలో మార్చి నెట్టింట్లోకి వదలడం.. లైకులు, వ్యూస్ చూసుకుని మురిసిపోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ....
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా దాన్ని వీడియోల రూపంలో మార్చి నెట్టింట్లోకి వదలడం.. లైకులు, వ్యూస్ చూసుకుని మురిసిపోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లే పట్టాలపై ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినూత్న ప్రయోగాలు చేసే ఓ యూట్యూబర్.. రైల్వే ట్రాక్‌పై ప్రయోగం చేసేందుకు వెళ్లాడు. రైలు పట్టాల మధ్యలో పాము పటాకులను (YouTuber burst firecrackers on railway tracks) కుప్పలు కుప్పలుగా పోసి నిప్పంటించాడు. దీంతో అవన్నీ మండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ మంటల ఎదురుగా నిల్చుని తన ప్రయోగం గురించి వివరిస్తూ వీడియో చేశాడు. సుమారు 33 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇతగాడి చేష్టలపై మండిపడుతున్నారు. కొందరు ఈ వీడియోను రైల్వే అధికారులకు ట్యాగ్ చేస్తూ.. సదరు యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఎట్టకేలకు రైల్వే అధికారులు స్పందించారు. వీడియోను షేర్ చేసిన యష్ అనే యూట్యూబర్‌పై కేసు నమోదైంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే FIR ప్రకారం రైల్వే ట్రాక్‌కు నష్టం కలిగించినందుకు జరిమానా, శిక్ష విధించాలనే నిబంధన ఉంది. రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని అధికారులు కోరుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల వీడియోల పిచ్చి వల్ల మిగతా వారికి ప్రమాదం జరుగుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-11-10T17:31:57+05:30 IST