Rent a Boyfriend App: అద్దెకు ప్రియుడు.. అమ్మాయిలకు మాత్రమే ఆప్షన్.. గంటల లెక్కన రేటు..!
ABN , First Publish Date - 2023-02-13T13:25:34+05:30 IST
తమ లైఫ్ మీద జోక్యం చేసుకోకుండా ఉండే కంపెనీ కాస్త దొరికితే బాగుండు అనిపిస్తుంది ఒంటరిగా ఉండే అమ్మాయిలకు. ముఖ్యంగా వాలెంటైన్ వీక్ లో
'బాయ్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును..' వినడానికి వింతగా ఉందా కానీ అదే నిజం. 'భర్తగ మారకు బ్యాచిలరూ సోలో బ్రతుకే సో బెటరు..' అని చెప్పినా, 'వద్దురా.. సోదరా.. పెళ్ళంటే నూరేళ్ళ మంటరా..' అని మొత్తుకున్నా.. అవన్నీ కేవలం అబ్బాయిలకే కాదు. పెళ్ళి, ప్రేమ వంటి వాటిని టచ్ చేయాలంటే చిరాకు పడే అమ్మాయిలు కూడా ఉంటున్నారు ఈకాలంలో.. తమ లైఫ్ మీద జోక్యం చేసుకోకుండా ఉండే కంపెనీ కాస్త దొరికితే బాగుండు అనిపిస్తుంది ఒంటరిగా ఉండే అమ్మాయిలకు. ముఖ్యంగా వాలెంటైన్ వీక్ లో జంటలు జంటలుగా సందడి చేసే ప్రేమ పక్షులను చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకోసం బాయ్ ఫ్రెండ్ ను అద్దెకిస్తున్నారట. దీని గురించి వివరాల్లోకి వెళితే..
'బాయ్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును.. కేవలం అమ్మాయిలకు మాత్రమే..' అనే క్యాప్షన్ తో భారతదేశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా, జపాన్ దేశాలలో ఎప్పటినుండో నడుస్తున్న ఈ కల్చర్ భారతదేశంలోనూ తనకు తిరుగులేదని నిరూపిస్తోంది. ఒంటరిగా ఉండే అమ్మాయిలు తమకు అలా బయటకు వెళ్ళి తిరిగిరావడానికి బాయ్ ఫ్రెండ్ ఒకరు బాగుంటుందని అనుకుంటారు. కానీ బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళకు నచ్చినట్టు ఉండటం, అన్ని విషయాలు వాళ్ళకు చెప్పాలి అనే ఒకానొక బాండింగ్ అంటే మాత్రం కొందరికి నచ్చదు. అలాంటి వారికి అద్దెకు దొరికే బాయ్ ఫ్రెండ్ లు మంచి ఆప్షన్ అంటున్నారు. చైనా జపాన్ దేశాలలో 12గంటలకు సుమారు 30వేల రూపాయలు చెల్లించి బాయ్ ఫ్రెండ్ లను అద్దెకు తీసుకుంటారు. అదే మన భారతదేశంలో గంటకు 3000వేల రూపాయలంటున్నారు. అయితే గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును అనే సర్వీస్ మాత్రం అందుబాటులో లేదని ఆత్రం రాయుళ్ళకు ముందే చెప్పేశారు వీళ్ళు.
Read also: 8కోట్లు చేతిలో పడగానే ప్లేటు ఫిరాయించిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..
ఇంతకూ ఇదెవరి ఆలోచన అంటే..
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కు చెందిన 31ఏళ్ల షకుల్ గుప్తా 'రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్'(Rent a boy friend) అనే యాప్ ను 5ఏళ్ళ క్రితమే తీసుకొచ్చాడు. వాలెంటైన్స్ వీక్(valentine week) సీజన్ లో దీనికి ఎక్కువగా స్పందన ఉంటుందని తెలిపాడు. 'ఒంటరిగా ఉన్న అమ్మాయిలు తమకు కంపెనీ కావాలని అనిపిస్తే ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను అద్దెకు తీసుకోండి, మీ సమయాన్ని నేను సంతోషంగా ఉండేలా చేస్తాను' అని ఇతను చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఇతను 50మంది పైగా అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ గా అద్దెకు వెళ్ళొచ్చాడట. ఇదంతా కూడా 'రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్'(Rent a boy friend) అనే యాప్ వల్ల జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ యాప్ మాదిరిగానే బెంగుళూరుకు చెందిన ఇద్దరు కుర్రాళ్ళు 'ది బెటర్ డేట్'(The better date) అనే యాప్ ను ప్రారంభించారు. అలాగే 'టాయ్ బాయ్'(Toy boy) పేరుతో బెంగుళూరులో ఒక పోర్టల్ కూడా నడుస్తోంది.
ఇలా బాయ్ ఫ్రెండ్ లను అద్దెకిస్తూ అమ్మాయిలకు కాసింత కంపెనీ ఇవ్వాలనుకునేది మా అభిమతం అని చెబుతున్న వీళ్ళ మాటల వెనుక బిజినెస్ సూత్రం కూడా ఉంటుందనుకోండి. అయితే ఒక్కమాట సుమీ.. అబ్బాయిలను అద్దెకు తీసుకునే అమ్మాయిల పర్సు మాత్రం బరువుగానే ఉండాలట. లచ్చిమిదేవి దగ్గరకే వాళ్ళు వచ్చేది మరి.