Smoking: పొద్దున్నే సిగరెట్ తాగే అలవాటుందా..? ఈ దారుణ నిజాలు తెలిస్తే అసలు లైటర్ కూడా వెలిగించరేమో..!
ABN , First Publish Date - 2023-11-03T11:17:47+05:30 IST
సిగరెట్ తాగే అలవాటున్న చాలామంది ఉదయం లేవగానే సిగరెట్ తాగి రిలాక్స్ అవుతుంటారు. అసలు ఉదయాన్నే సిగరెట్ తాగాలని అనిపించడానికి కారణాలు తెలిస్తే భయపడతారు..
సిగరెట్లు తాగడం ఇప్పట్లో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా సిగరెట్ కాలుస్తున్నారు. సిగరెట్ తాగడం ఫ్యాషన్ అని, ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు లేకపోతే నాగరికులు కాదనే అపోహ చాలా మంది యువతలో ఉండటం వల్ల దీనికి బానిసలైపోతున్నారు. సిగరెట్ వ్యసనం ఉన్న చాలామంది పొద్దున్నే సిగరెట్ తాగి రిలాక్స్ ఫీల్ అవుతుంటారు. అసలు ఉదయాన్నే సిగరెట్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది? ఉదయాన్నే సిగరెట్ తాగితే ఏం జరుగుతుంది? వీటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటే..
పొగాకు వినియోగం గురించి గ్లోబల్ అడల్ట్ టొకాబో సర్వేలో కొన్ని షాకింగ్ గణాంకాలు వెల్లడయ్యాయి. ధూమపానం కోసం వినియోగిస్తున్న పొగాకు 10.38శాతం. పొగలేకుండా నేరుగా నోటి ద్వారా పొగాకు వినియోగం 21.38శాతం. పెద్దవారిలో పొగాకు వినియోగించేవారు 28.6శాతం. అయితే పురుషులు 42.4శాతం మంది పొగాకు తీసుకుంటుండగా, స్త్రీలు 14.2 శాతం మంది పొగాకు తీసుకుంటున్నారు.
Read also: Health Facts: తక్కువ వయసులోనే చనిపోకూడదని అనుకుంటున్నారా..? ఎక్కువ కాలం బతకాలంటే అసలేం చేయాలంటే..!
చాలావరకు పొగాకుకు బానిసైనవారు, సిగరెట్లు ఎక్కువగా కాల్చేవారు ఉదయం నిద్రలేవగానే అరగంటలోపే సిగరెట్ తాగుతుంటారు(smoking in early morning). సిగరెట్ తాగడం వ్యసనమైన వారు రాత్రంతా సిగరెట్ తాగకుండా ఉంటారు. ఇది రక్తంలో నికోటిన్ స్థాయి భారీగా తగ్గడానికి కారణం అవుతుంది. సిగరెట్ ఎక్కువగా తాగేవారిలో ఈ పరిస్థితి మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటివారి శరీరంలో న్యూరోసెస్టర్లు సిగరెట్ తాగాలనే కోరికను ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా ఉదయం నిద్రలేచిన అరగంటలోపే సిగరెట్ తాగుతుంటారు.
ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం తెలిసిందే. ఉదయం నిద్రలేచిన తరువాత 30నిమిషాలలోపు సిగరెట్లు తాగేవారి రక్తంలో పొగాకు లో ఉండే మెటాబోలైట్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు కేవలం ఉదయాన్నే సిగరెట్ తాగడంతోనే కాదు రోజంతా ఎక్కువ మొత్తం సిగరెట్లు తాగుతుంటారు. ఉదయాన్నే సిగరెట్ తాగేవారిలో సాధారణంగా సిగరెట్ తాగేవారికంటే ఎక్కువగా ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వచ్చేప్రమాదం ఉంది. ఇవి మాత్రమే కాకుండా అన్నవాహిక, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులను తగ్గించడం, రక్తపోటు, అంగస్థంభన, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం, బ్రోన్కైటిస్, ఎంఫిసెమా మొదలైన సమస్యలు కూడా చుట్టుముట్టి తొందరగా మరణానికి చేరువ చేస్తాయి.