హెచ్‌సీఏ అవినీతిపై ఏసీబీ కూపీ

ABN , First Publish Date - 2023-01-09T00:43:17+05:30 IST

దేశానికి గతంలో అద్భుతమైన క్రికెటర్లను అందించిన హైదరాబాద్‌ ఇప్పుడు...

హెచ్‌సీఏ అవినీతిపై ఏసీబీ కూపీ

చిక్కింది ఒక్కరే.. ఇంకా ఎందరో!

తీగ లాగుతుంటే కదులుతున్న డొంక

ఆన్‌లైన్‌లో చెల్లించడంతో పక్కా ఆధారం

జట్టులో చోటు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే

బాధితులు ముందుకు రావాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): దేశానికి గతంలో అద్భుతమైన క్రికెటర్లను అందించిన హైదరాబాద్‌ ఇప్పుడు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్‌.విజయానంద్‌కు చెందిన కాంటినెంటల్‌ క్లబ్‌ ఉపాధ్యక్షుడు పి.శ్రీనివా్‌సను పది రోజుల కిందట ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వినూ మన్కడ్‌, కూచ్‌ బెహార్‌ అండర్‌-19 టోర్నమెంట్లలోని అన్ని మ్యాచ్‌ల్లో తమ పిల్లాడిని ఆడిస్తామని ఓ బాధితుడి నుంచి శ్రీనివాస్‌ రూ.9 లక్షలు లంచంగా తీసుకున్నాడని ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన ఏసీబీ గత నెల 27వ తేదీన శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పలు ఫైళ్లతో పాటు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ అవినీతి సామాజ్య్రంలో శ్రీనివాస్‌ ఒక అణువు మాత్రమేనని.. దీని మూలాలు చాలా బలంగా ఉన్నాయని.. ఇప్పుడు వాటన్నింటిని బయటికి లాగుతున్నామని ఒక అధికారి తెలిపారు. శ్రీనివా్‌సను పట్టుకునే ముందు భారీ కసరత్తు చేశారని తెలుస్తోంది. హెచ్‌సీఏ అవినీతి కూపంలో ఇప్పుడు చిక్కింది చిన్న చేపనే అని.. ఈ వ్యవహారంలో పెద్ద చేపలూ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ సూపర్‌వైజింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్‌ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకోవడంతో క్రికెట్‌ అసోసియేషన్‌లోని అవినీతి తిమింగళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇది ఒక్క వ్యక్తి లేదా ఒక్క క్లబ్‌ చేస్తున్న తంతు కాదని.. హెచ్‌సీఏలోని కొందరు పెద్ద మనుషులు సిండికేట్‌గా ఏర్పడి మెజారిటీ క్లబ్‌లను వారి గుప్పి ట్లో ఉంచుకుని నడిపిస్తున్న అవినీతి సామ్రాజ్యంగా ఎప్పటి నుంచో విమర్శలు వస్తుండడంతో భిన్న కోణాల్లో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌

బాధితుడి నుంచి రూ.9 లక్షలు తీసుకున్న శ్రీనివాస్‌ ఇచ్చిన హామీ మేరకు ఆడించడంలో విఫలమయ్యాడు. ఒకసారి సెలెక్షన్స్‌కు పిలిచారు కానీ, మ్యాచ్‌ల్లో ఆడించలేదు. రెండోసారి కూడా ఇలానే జరగడంతో బాధితుడు గట్టిగా నిలదీశాడు. దీంతో ఒక మ్యాచ్‌లో ఆడించి చేతులు దులుపుకోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు తాను ఆన్‌లైన్‌లో రూ.9 లక్షలు బదిలీ చేసిన విషయాన్ని అధికారులకు ఆధారాలతో సహా చూపించడంతో నిందితుడు శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై దర్యాప్తుకొనసాగుతుండడంతో భవిష్యత్‌లో కొందరు హెచ్‌సీఏ పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశముంది.

నోటు కొట్టు.. చోటు పట్టు

ప్రతిభకు పాతరేసి నోట్ల కట్టలకు హెచ్‌సీఏ జట్టులోని స్థానాలను అమ్ముకుంటున్న కొందరు చీడ పురుగుల వల్ల నైపుణ్యాలు గల పేద క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని క్రికెటర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ లీగ్‌ల్లో సెంచరీల మోత మోగించినా.. పదుల సంఖ్యలో వికెట్లు పడగొట్టినా, సెలెక్షన్స్‌ దగ్గరికొచ్చే సరికి బేరసారాలు చేస్తున్నారని పలువురు వర్ధమాన క్రికెటర్లు వాపోతున్నారు. కనీసం రూ.5 లక్షలు చెల్లిస్తేనే హెచ్‌సీఏ జట్టులో చోటు దక్కే దుస్థితి దాపురించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. గతంలో జట్టులో చోటు కోసం డబ్బులు చెల్లించిన వారు లేదా జట్టులో చోటు కావాలంటే డబ్బులు చెల్లించమని ఎవరినైనా అడిగుంటే ధైర్యంగా బాధితులు ముందుకొచ్చి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-01-09T00:43:18+05:30 IST