BCCI: బీసీసీఐ ఆదాయం మామూలుగా లేదుగా.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కన్నా 28 రెట్లు ఎక్కువ
ABN, First Publish Date - 2023-12-13T13:58:39+05:30
BCCI Net Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆదాయపరంగా మిగతా క్రికెట్ బోర్డులు ఏవి బీసీసీఐకి చేరువలో కూడా లేవు. ప్రస్తుతం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బుతో అవరమైతే ఐసీసీనే కొనేయగలదు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆదాయపరంగా మిగతా క్రికెట్ బోర్డులు ఏవి బీసీసీఐకి చేరువలో కూడా లేవు. ప్రస్తుతం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బుతో అవరమైతే ఐసీసీనే కొనేయగలదు. అంతెందుకు ప్రస్తుతం ఐసీసీకి వస్తోన్న ఆదాయంలో అత్యధిక శాతం బీసీసీఐ నుంచే వెళ్తోంది. ప్రతి సంవత్సరం బీసీసీఐ ఆదాయం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. టీమిండియాకు ఉన్న క్రేజ్, కోట్లలో ఉన్న అభిమానుల కారణంగా బీసీసీఐకి కాసుల పంట పడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌లు ఆడితే మంచి ఆదాయం ఉండడంతో ఇతర క్రికెట్ బోర్డులు కూడా మన జట్టుతో ఆడే అవకాశం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటాయి. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ద్వారా బీసీసీఐ ఆదాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీసీసీఐ నెట్‌వర్త్ రికార్డు స్థాయిలో ఏకంగా 2.25 బిలియన్ డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో అక్షరాల రూ.18,760 కోట్లుగా ఉంది.
ఇతర క్రికెట్ బోర్డుల ఆదాయం బీసీసీఐ దాంట్లో 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఏ బోర్డు నెట్‌వర్త్ కనీసం ఒక బిలియన్ డాలర్ కూడా లేదు. ప్రపంచంలో బీసీసీఐ తర్వాత సంపాదనలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నెట్‌వర్త్ 79 మిలియన్ డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో రూ.658 కోట్లు మాత్రమే. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కన్నా బీసీసీఐ ఆదాయం 28 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నెట్‌వర్త్ 59 మిలియన్ డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో రూ.490 కోట్లుగా ఉంది. కాగా సాధారణంగా క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్టులు, టోర్నమెంట్‌ల నిర్వహణను చూసుకుంటాయి. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు వంటి రకరకాల రూపంలో బోర్డులకు భారీగా ఆదాయం వస్తుంటుంది. ఈ విషయంలో బీసీసీఐకి తిరుగులేదు. ఐపీఎల్ ప్రారంభంతో ఆర్థికంగా బీసీసీఐ మరింత శక్తివంతంగా తయారైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-13T14:10:29+05:30 IST