World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని బీసీసీఐపై ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-11-02T08:57:18+05:30
బీసీసీఐ, బుక్‌మైషో కలిసి టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాయని పలువురు అభిమానులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ అభిమాని ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.
కోల్‌కతా: భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ అభిమానులను ఉర్రుతలూగిస్తోంది. ప్రతి రోజూ మ్యాచ్ ప్రారంభమైన వెంటనే టీవీలకు, మొబైల్స్‌కు అభిమానులు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో నేరుగా మైదానానికి వెళ్లి మ్యాచ్ చూడాలని ఆశించే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మ్యాచ్ చూడడానికి నేరుగా మైదానానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సాధారణ అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఎంతగా ప్రయత్నించినా మ్యాచ్ టికెట్లు దొరకడం లేదు. ముఖ్యంగా భారత జట్టు ఆడే మ్యాచ్ టికెట్లు దొరకడం గగనమైతోంది. దీంతో బీసీసీఐ, బుక్‌మైషో కలిసి టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాయని పలువురు అభిమానులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ అభిమాని ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. ఈ నెల 5న భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ బీసీసీఐ, బుక్‌మైషో, క్యాబ్(బెంగాల్ క్రికెట్ అసోసియేషన్)పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సాధారణ అభిమానులకు ఇవ్వాల్సిన టికెట్లలో పెద్ద మొత్తంలో క్యాబ్, బుక్‌మైషో అధికారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఫిర్యాదులో అభిమాని పేర్కొన్నాడు. దీందో సాధారణ అభిమానులకు టికెట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ నెల 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కోల్‌కతా పోలీసులు బుక్‌మైషో, క్యాబ్ అధికారులకు నోటీసులు పంపించారు. సదరు అధికారులు నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై బీసీసీఐ, బుక్‌మైషో, క్యాబ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆరోపణలపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇలాంటి ఉదంతాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మ్యాచ్ టికెట్లను భారీ ధరలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఇంతకు ముందు కూడా పలు కేసులు నమోదుయ్యాయి. కాగా ప్రపంచకప్‌లో మరో 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల ఆరోపణలు రావడం కలవరపరిచే అంశమని పలువురు అభిప్రాయడుతున్నారు.
Updated Date - 2023-11-02T10:05:25+05:30 IST