IND vs SA: రింకూ సింగ్ విధ్వంసం దెబ్బకు మీడియా బాక్స్ బద్దలు
ABN, First Publish Date - 2023-12-13T08:52:34+05:30
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగాడు. టీమిండియా 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ దుమ్ములేపాడు.
ఎబేహ: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగాడు. టీమిండియా 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ దుమ్ములేపాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత సూర్య ఔటైనప్పటికీ డెత్ ఓవర్లలో రింకూ చెలరేగాడు. చివరలో వేగంగా ఆడి జట్టు స్కోర్‌ను 180 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 9 ఫోర్లు, 2 సిక్సులతో 39 బంతుల్లో 68 పరుగులు చేసిన రింకూ సింగ్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ కొట్టిన ఓ భారీ సిక్సర్ స్టేడియంలోని మీడియా బాక్స్‌కు బలంగా తాకింది. దీంతో మీడియా బాక్స్ గ్లాస్ పగిలిపోయింది. సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ చివరి 2 బంతులను సిక్సర్లుగా మలిచిన రింకూ ఆ ఓవర్లో 16 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కొట్టిన సిక్సర్ దెబ్బకు మీడియా బాక్స్ గ్లాస్ బద్దలైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టును ఆదుకున్నారు. తిలక్ వర్మ 29, రవీంద్ర జడేజా 19 పరుగులు చేశారు. అయితే వర్షం రావడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. 9 ఫోర్లు, 2 సిక్సులతో 39 బంతుల్లో 68 పరుగులు చేసిన రింకూ సింగ్ నాటౌట్‌గా నిలిచాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో రింకూ సింగ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ. వర్షం ఆగాక డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లో 152 పరుగులుగా నిర్ణయించారు. అయితే 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేధించింది.
Updated Date - 2023-12-13T08:54:52+05:30 IST