IND Vs PAK: ఫ్యాన్స్ వినూత్న ఆలోచన... హోటల్స్ వద్దు.. ఆస్పత్రులే ముద్దు..!!
ABN, First Publish Date - 2023-07-22T16:50:23+05:30
వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే అభిమానులు హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు బుక్ చేసుకునే బదులు ఆస్పత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకుంటే సరిపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ (India-Pakistan) క్రికెట్ మ్యాచ్‌కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఐసీసీ (ICC) ఈవెంట్లు, ఆసియా కప్ (Asia Cup) లాంటి టోర్నీలలో తప్పితే ఎక్కడా ఆడటం లేదు. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ రెండు టీమ్‌లు రెగ్యులర్‌గా తమ దేశాలలో ద్వైపాక్షిక సిరీస్‌లు (Billengual Series) ఆడేందుకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. దీంతో ఐసీసీ ఈవెంట్లలో దాయాదుల సమరం జరుగుతుంటే అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు బారులు తీరుతున్నారు. భారత్-పాకిస్థాన్ ఎక్కడ తలపడినా ఆ దేశానికి వెళ్లి మరీ వీక్షించడానికి రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరిగే ఆసియా కప్, ఆ తర్వాత ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు ఇప్పటివరకు తలపడలేదు. దీంతో ఆసియా కప్‌లో దాయాదుల మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అటు వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే అభిమానులు హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. తాజా సమాచారం ఏంటంటే అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ కోసం స్థానికంగా ఉండే హోటళ్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: INDW vs BANW: భారత్‌పై సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్
తాజా లెక్కల ప్రకారం అహ్మదాబాద్ నగరంలో ఒక్క రాత్రి హోటల్‌లో ఉండాలంటే రూ.50 వేలు ఖర్చవుతోందని తెలుస్తోంది. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడటం సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్రికెట్ అభిమానులు కొత్త తరహా ఉపాయం ఆలోచించారు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో వసతి కోసం మొతేరా స్టేడియం చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు బుక్ చేసుకునే బదులు ఆస్పత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకుంటే సరిపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. హోటళ్ల కంటే ఆస్పత్రుల్లో బెడ్లు చౌకగా లభిస్తాయని.. ఒక బెడ్‌ను రిజర్వ్ చేస్తే సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకుంటామని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అటు మ్యాచ్‌కు వెళ్లవచ్చు.. ఇటు వైద్య పరీక్షలు కూడా చేయించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి. తొలుత రోగులకే తమ ప్రాధాన్యం అని.. ఎందుకంటే ఆస్పత్రుల్లో బెడ్లు పరిమితంగానే ఉంటాయని.. వాటిని క్రికెట్ ఫ్యాన్స్ బుక్ చేసుకోవడం వల్ల రోగులు ఇబ్బందిపడతారని అహ్మదాబాద్‌లోని డాక్టర్లు వివరిస్తున్నారు.
Updated Date - 2023-07-22T16:50:23+05:30 IST