IPL 2024 Auction: పాన్ షాప్ ఓనర్ కొడుకు కోటీశ్వరుడయ్యాడు.. ఎవరా క్రికెటర్? ఏంటా కథ?
ABN, Publish Date - Dec 20 , 2023 | 01:09 PM
Shubham Dubey: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పుణ్యమా అని అనామక ఆటగాళ్లు సైతం కోటీశ్వరులైపోతున్నారు. టాలెంట్ ఉంటే చాలు వారి కుటుంబ నేపథ్యంతో పని లేకుండా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి.
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పుణ్యమా అని అనామక ఆటగాళ్లు సైతం కోటీశ్వరులైపోతున్నారు. టాలెంట్ ఉంటే చాలు వారి కుటుంబ నేపథ్యంతో పని లేకుండా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ప్రతి ఏడాది వేలం తర్వాత ఎవరో ఒక పేద క్రికెటర్ కోటీశ్వరుడు అవడం మనం చూస్తూనే ఉన్నాం. రింకూ సింగ్ వంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. దుబాయ్ వేదికగా మంగళవారం ముగిసిన వేలంలో కూడా ఓ సాధారణ క్రికెటర్ కోటీశ్వరుడైపోయాడు. నాగ్‌పూర్‌లో పాన్ షాప్ నడుపుకుంటూ బతుకుతున్న ఓ వ్యక్తి కొడుకు ఐపీఎల్ 2024 వేలం తర్వాత రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకప్పుడు క్రికెట్ బ్యాట్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో ఉన్న ఆ క్రికెటర్ నేడు కోట్లు ఆర్జించబోతున్నాడు. అతనే మంగళవారం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన శుభమ్ దూబే.
రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన ఎడమ చేతి బ్యాటర్ శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.5.8 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. దూబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఏ మాత్రం వెనక్కి రాజస్థాన్ మేనేజ్‌మెంట్ అతనిపై కోట్లు కుమ్మరించింది. దీంతో ఈ సారి వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఒకడిగా 29 ఏళ్ల దూబే నిలిచాడు. దూబే తండ్రి బద్రీప్రసాద్ నాగ్‌పూర్‌లో పాన్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దీంతో చిన్నతనంలో శుభమ్ దూబే తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొవలసి వచ్చింది. క్రికెట్ కిట్ కూడా కొనడానికి అతని దగ్గర డబ్బులు ఉండేవి కావు. అయితే అతని టాలెంటే శుభమ్ దూబేను ఐపీఎల్ వరకు తీసుకొచ్చింది. దూబే టాలెంట్ చూసి సుదీప్ అనే వ్యక్తి అతనికి ఆర్థికంగా సహాయం చేశాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్న దూబే నేడు ఐపీఎల్ జట్టుకు ఎంపికయ్యాడు.
ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే చెలరేగడం కూడా అతనికి కలిసొచ్చింది. మిడిలార్డర్ బ్యాటరైనా దూబే ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 187 స్ట్రైక్ రేటుతో చెలరేగి 222 పరుగులు చేశాడు. జాతీయ టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌లాడిన దూబే 37 సగటుతో 485 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి భారీ హిట్టింగ్ చేయగల సత్తా ఉండడం దూబేకు కలిసొచ్చింది. ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం పట్ల శుభమ్ దూబే స్పందించాడు. ‘‘ఈ ఆనందం వర్ణించలేనిది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను బాగా రాణించాను. దీంతో వేలంలో కొనుగోలు అవుతాననే ఆశాభావంతో ఉన్నాను. కానీ నిజం చెప్పాలంతే నేను ఇంత పెద్ద మొత్తాన్ని ఆశించలేదు. గతంలో మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సమయంలో నాకు సుదీప్ సార్ చాలా సహాయం చేశారు. ఆయన మద్దతు లేకపోయి ఉంటే నేను నా జీవితంలో ఏమీ సాధించే వాడిని కాదు. గ్లోవ్స్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ సమయంలో సుదీప్ సార్ నాకు కొత్త క్రికెట్ కిట్ ఇచ్చారు. ఆయన నన్ను అండర్ 19, అండర్ 23, ‘ఏ’ జట్ల ప్లేయింగ్ 11లో చేర్చారు. ఆయన లేకుంటే నేను విదర్భ క్రికెట్ అసోసియేషన్ జట్టులోకి వచ్చే వాడినే కాదు.’’ అని దూబే తెలిపాడు. కాగా జాతీయ జట్టులో దూబే విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Updated Date - Dec 20 , 2023 | 01:09 PM