Nagpur Test: ముగిసిన రెండో రోజు ఆట.. పటిష్టమైన స్థితిలో భారత్
ABN, First Publish Date - 2023-02-10T17:32:10+05:30
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట
నాగ్‌పూర్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు(Team India) తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై 144 పరుగుల ఆధిక్యం సాధించింది. రవీంద్ర జడేజా (66), అక్షర్ పటేల్ (52) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 77/1తో భారత జట్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన రవిచంద్రన్ అశ్విన్ (23) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12), తొలి టెస్టు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మాత్రం బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి సమయోచితంగా ఆడాడు. ఇద్దరూ కలిసి స్కోరుబోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోయారు.
ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్(Rohit) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్(8) కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. అయితే, అక్షర్ పటేల్ మాత్రం నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో కలిసి చక్కని ఇన్నింగ్స్ ఆడుతూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి టెస్టు ఆడుతున్న ఆసీస్ బౌలర్ టాడ్ మర్ఫీ(Todd Murphy) అరంగేట్రంలోనే అదరగొట్టాడు. 5 వికెట్ల ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా(Australia) తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. గాయం కారణంగా చాలా కాలంపాటు జట్టుకు దూరమైన జడేజా(Jadeja) వచ్చీ రావడమే అదరగొట్టాడు. ఐదు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్ చేసిన 49 పరుగులే అత్యధికం.
Updated Date - 2023-02-10T17:32:20+05:30 IST