World cup: రెండున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసిన సౌతాఫ్రికా.. పాకిస్థాన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు
ABN, First Publish Date - 2023-10-28T10:01:03+05:30
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ విసిరిన 271 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా జట్టు ఒకానొక దశలో 235/5తో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.
చెన్నై: చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ విసిరిన 271 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా జట్టు ఒకానొక దశలో 235/5తో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న మాక్రమ్(91) కూడా ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 260/9తో నిలిచింది. విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండడం, చేతిలో ఒకే వికెట్ మాత్రమే ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో పాక్ మ్యాచ్‌లోకి వచ్చింది. సంచలన విజయం సాధిస్తుందేమో అనిపించింది. కానీ చివర్లో కేశవ్ మహారాజ్, షంసీ విజయానికి కావాల్సిన మిగతా 11 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా గట్టెక్కింది. ముఖ్యంగా నవాజ్ వేసిన 48వ ఓవర్లో కేశవ్ మహారాజ్ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.
ఈ క్రమంలో సౌతాఫ్రికా రెండున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ప్రపంచకప్ టోర్నమెంట్లలో 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా మళ్లీ గెలిచింది. ఆ జట్టు ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై చివరగా 1999లో గెలిచింది. ఆ సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ప్రపంచకప్ టోర్నీలలో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా మళ్లీ గెలవలేదు. ఆ తర్వాతి నుంచి వన్డే లేదా టీ20 ప్రపంచకప్ టోర్నీలలో పాకిస్థాన్‌తో ఎప్పుడు ఆడిన సౌతాఫ్రికా ఓడిపోయింది. అలా రెండు దశాబ్దాలు దాటిపోయాయి. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లలో రెండు సార్లు, టీ20 ప్రపంచకప్‌లలో 4 సార్లు తలపడ్డాయి. మొత్తంగా ఆరు సార్లు తలపడ్డాయి. ఈ ఆరు సార్లు పాకిస్థానే గెలిచింది. 2015 వన్డే ప్రపంచకప్‌లో 29 పరుగుల తేడాతో, 2019 వన్డే ప్రపంచకప్‌లో 49 పరుగుల తేడాతో పాక్ చేతిలో సౌతాఫ్రికా ఓడింది. ఇక టీ20 ప్రపంచకప్‌ల విషయానికొస్తే.. 2009లో 7 పరుగుల తేడాతో, 2010లో 11 పరుగుల తేడాతో, 2012లో రెండు వికెట్ల తేడాతో, 2022లో 33 పరుగుల తేడాతో పాకిస్థాన్ చేతిలో సౌతాఫ్రికా ఓడింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా ఒకసారి కూడా గెలవలేదు. మొత్తంగా పాకిస్థాన్ చేతిలో వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు చెక్ పెడుతూ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయభేరి మోగించింది. ఇక అదే సమయంలో పాకిస్థాన్ పరంగా చూస్తే ఆ జట్టు 24 ఏళ్లుగా కాపాడుకున్న రికార్డు బద్దలైంది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రెండున్నర దశాబ్దాల తర్వాత సౌతాఫ్రికా చేతిలో పాకిస్థాన్ తొలిసారి ఓటమి పాలైంది.
Updated Date - 2023-10-28T10:50:27+05:30 IST