World cup: సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడతాయా?.. పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరాలంటే జరగాల్సింది ఇదే!
ABN, First Publish Date - 2023-10-31T12:08:43+05:30
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. దీంతో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. నిజానికి హైదారబాద్‌లో జరిగిన తమ ఆరంభ రెండు మ్యాచ్‌ల్లో పాక్ బాగానే ఆడింది. మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని చేధించి గెలిచింది. దీంతో టోర్నీలో పాక్ బలంగా కనిపించింది. కానీ భారత్‌తో ఆడిన మూడో మ్యాచ్ నుంచి వరుస పరాజయాలను చవిచూసింది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికాల చేతిలో ఓడింది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేసులో వెనుకబడింది. దీంతో సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది. అయితే పాకిస్థాన్‌కు సెమీస్ దారులు పూర్తిగా ఏమి మూసుకుపోలేదు. నాకౌట్ పోరులో అడుగుపెట్టేందుకు ఆ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి.
మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిస్తే..
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడనుంది. ప్రస్తుతం పాక్ ఖతాలో 4 పాయింట్లున్నాయి. మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిస్తే 5 విజయాలతో జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. దీంతో పాక్ సెమీస్ చేరేందుకు మెరుగైన అవకాశాలుంటాయి. కానీ ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్‌ల ఫలితాలు పాక్‌కు అనుకూలంగా రావాలి. ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ జట్లు తమకు మిగిలిన అన్నీ మ్యాచ్‌లను ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కివీస్, ఆసీసీ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. అప్పుడు ఆ జట్టు 8 పాయింట్లతో రేసులో వెనుకబడుతుంది. పైగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే కివీస్ పాయింట్ల రేసులో వెనుకబడుతుంది. అఫ్ఘానిస్థాన్ జట్టు తమకు మిగిలిన 3 మ్యాచ్‌ల్లో రెండు లేదా ఒకటి మాత్రమే గెలవాలి. శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు కూడా తమకు మిగిలిన మూడేసి మ్యాచ్‌ల్లో ఒకటి లేదా రెండే గెలవాలి. అప్పుడు పాక్ టాప్ 4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జట్లు కూడా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే పాక్‌కు కష్టమవుతుంది. అప్పుడు నెట్ రన్ రేటు కీలకమవుతుంది. మెరుగైన రనట్ రేటు ఉన్న జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. కాబట్టి పాకిస్థాన్ నెట్ రన్ రేటును కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
మూడు మ్యాచ్‌ల్లో రెండే గెలిస్తే..
పాకిస్థాన్ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండే గెలిస్తే ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు పాకిస్థాన్ నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి. పాక్‌కు సెమీస్ అవకాశాలు ఉండాలంటే ప్రస్తుతం ఎనిమిదేసి పాయింట్ల చొప్పున కల్గి ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయింట్లున్న అఫ్ఘానిస్థాన్ కూడా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. లేదంటే ఒక మ్యాచ్‌కు మించి గెలవకూడదు. శ్రీలంక, నెదర్లాండ్స్ తమకు మిగిలిన మూడేసి మ్యాచ్‌ల్లో ఒకటి లేదా రెండు మాత్రమే గెలవాలి. అప్పుడు కూడా నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. దీంతో పాకిస్థాన్ గెలిచే 2 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. పైగా ప్రస్తుతం 8 పాయింట్ల చొప్పున కల్గి ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన రన్ రేటును కల్గి ఉన్నాయి. దీంతో పాక్ రెండు మ్యాచ్‌లు గెలిచి.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మిగిలిన మ్యాచ్‌లన్నీ ఓడిపోతే ఈ 3 జట్ల పాయింట్లు సమం అవుతాయి. అఫ్ఘనిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా ఎనిమిదేసి పాయింట్లు సాధించే అవకాశాలున్నాయి. అప్పుడు మెరుగైన రన్ రేటు ఉన్న జట్లు మాత్రమే సెమీస్‌లో అడుగుపెడతాయి. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్ రన్ రేటు కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలంటే..
పాకిస్థాన్ మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా.. లేదంటే అన్ని ఓడిపోయినా నిస్సందేహంగా నాకౌట్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి. ఎందుకంటే ఒక మ్యాచ్ గెలిస్తే పాక్ ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అన్ని ఓడితే 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో పాక్ సెమీస్ చేరే అవకాశాలుండవు. ఇక సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలని చాలా మందే కోరుకుంటున్నారు. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలంటే ముందు పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు టాప్ 4లో నిలవాలి. అప్పుడు రెండు జట్లు కూడా సెమీస్‌కు అర్హత పొందుతాయి. ఇక ఒకటి, నాలుగు లేదా రెండు, మూడు స్థానాల్లో భారత్, పాకిస్థాన్ ఉంటే సెమీస్‌లో తలపడడం ఖాయం. అలాకాకుండా ఒక జట్టు మొదటి స్థానంలో ఉండి మరో జట్టు రెండు లేదా మూడో స్థానంలో ఉంటే భారత్, పాక్ సెమీస్ పోరు జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ రెండు జట్లు సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ పోరు చూడొచ్చు. కాగా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఒకసారి కూడా తలపడలేదు.
Updated Date - 2023-10-31T12:08:43+05:30 IST