IND vs WI: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. మొదటి టీమిండియా ఆల్‌రౌండర్‌గా రికార్డు
ABN, First Publish Date - 2023-08-07T09:31:40+05:30
టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు, 4 వేల పరుగుల చేసిన మొదటి భారత ఆల్‌రౌండర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా హార్దిక్ ఈ రికార్డును అందుకున్నాడు.
గయానా: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు, 4 వేల పరుగుల చేసిన మొదటి భారత ఆల్‌రౌండర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా హార్దిక్ ఈ రికార్డును అందుకున్నాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా హార్దిక్ టీ20ల్లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ అరుదైన మైలురాయిని హార్దిక్ పాండ్యా చేరుకున్నాడు. ఇప్పటివరకు 241 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా బ్యాటర్‌గా 29 సగటుతో 4,391 పరుగులు చేశాడు. ఇందులో 210 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన హార్దిక్ 150 వికెట్లు తీశాడు. కాగా 29 ఏళ్ల హార్దిక్ పాండ్యా 11 అక్టోబర్ 1993లో గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2015లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి టీ20 మ్యాచ్‌ను 27 జనవరి 2016న ఆస్ట్రేలియాతో ఆడాడు. వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా మరో రికార్డును కూడా చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను హార్దిక్ అధిగమించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఖాతాలో 73 వికెట్లున్నాయి. కాగా ఇప్పటివరకు జస్ప్రీత్ బుమ్రా 72, అశ్విన్ 71 వికెట్లు తీశారు. ఈ జాబితాలో చాహల్(95), భువనేశ్వర్ కుమార్ (90) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టీ20 సీరీస్‌లో భారత్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో మరోసారి టీమిండియా చతికిలపడింది. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం వరుసగా రెండో టీ20ల్లోనూ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. 152 పరుగులను కాపాడే క్రమంలో బౌలర్లు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకనొక దశలో వెస్టిండీస్‌ను 129/8తో కష్టాల్లోకి నెట్టి గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆ జట్టు టేలెండర్లు అకేల్ హోసేన్(16), అల్జారీ జోసెఫ్(10) అద్భుతంగా పోరాడడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. నికోలస్ పూరన్(67)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అంతకుముందు బ్యాటింగ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(51) తప్ప బ్యాటింగ్‌తో ఇతరులెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. కాగా ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 0-2తో వెనుకబడింది.
Updated Date - 2023-08-07T09:31:40+05:30 IST