India Playing 11 For 2nd Test: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టే? జడేజా ఔట్.. అక్షర్ పటేల్‌కు చోటు?..
ABN, First Publish Date - 2023-07-18T19:56:05+05:30
మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్‌కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ట్రినిడాడ్: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సునాయసంగా గెలిచిన భారత జట్టు ఈ నెల 20 నుంచి జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైనా ట్రినిడాడ్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్‌కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్ పేస్‌కు అనుకూలిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా.. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. గత మ్యాచ్‌లో రాణించలేకపోయినా గిల్ ఈ సారి చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో రహానే స్థానాలకు ఢోకా లేదు. దీంతో తుది జట్టులో చోటు ఆశిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు నిరాశ తప్పకపోవచ్చు. ఇక వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలున్నాయి. అదే జరిగితే తెలుగు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ మరోసారి బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. అలాగే ఈ మ్యాచ్‌లో కిషన్ బ్యాటర్‌గా కూడా రాణిస్తే భరత్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. 29 ఏళ్ల భరత్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే అనేక అవకాశాలు ఇచ్చింది. కానీ దానిని వినియోగించుకోవడంలో భరత్ విఫలమయ్యాడు. వికెట్ కీపర్‌గా సత్తా చాటినప్పటికీ బ్యాట్‌తో పరుగులు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జట్టులో స్థానం కోల్పోతే తిరిగి రావడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక స్పిన్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. వీరిద్దరు బ్యాటుతో కూడా రాణిస్తారు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్నర్లు ప్రభావం చూపారు కాబట్టి మూడో స్పిన్నర్‌ను తీసుకోవాలనకుంటే అక్షర్ పటేల్‌కు కూడా చోటు దక్కుతుంది. లేదంటే భవిష్యత్‌లో ఉండే బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని జడేజాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు అక్షర్ తుది జట్టులో చోటు సంపాదించుకుంటాడు. ఇక పేసు కోటాలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ స్థానాలకు ఢోకా ఉండకపోవచ్చు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో జయదేవ్ ఉనద్కత్ పరుగులు తక్కువగా ఇచ్చినప్పటికీ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతనికి మరో అవకాశం ఇస్తారా? లేదంటే ముఖేష్ కుమార్, నవదీప్ సైనీలలో ఒకరికి అవకాశం ఇస్తారేమో చూడాలి. అయితే ఎలాంటి మార్పులు లేకుండా, విన్నింగ్ కాంబినేషన్‌పను కొనసాగించాలనే ఉద్దేశంతో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత జట్టు బరిలోకి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
టీమిండియా తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్/నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్
Updated Date - 2023-07-18T20:12:18+05:30 IST