IND vs AUS: టీ20 క్రికెట్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా..
ABN, First Publish Date - 2023-11-29T08:57:18+05:30
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.
గువాహటి: ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా బౌలర్ కేజే అబాట్‌తో కలిసి ఐదో స్థానంలో ఉన్నాడు. 75 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్ కసున్ రజిత ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 72 పరుగులిచ్చిన స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ సోలె రెండో స్థానంలో.. 70 రన్స్ ఇచ్చిన తుర్కియే బౌలర్ టురన్ మూడో స్థానంలో, 69 పరుగులిచ్చిన ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తి నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే హ్యాట్రిక్ విజయాలతో ఐదు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకున్న యువ భారత్ ఆశలపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్) నీళ్లు జల్లాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతీరుతో చెలరేగి విజయాన్ని లాగేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 నాటౌట్) వీరోచిత శతకంతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. మ్యాక్స్ బాదుడుకు ఆఖరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 30 పరుగులిచ్చుకున్న అతనే.. తమ ఛేదనలో 6 బంతుల్లో 21 పరుగులను అలవోకగా సాధించి లెక్క సరిచేశాడు. దీంతో ఆసీస్ 5 వికెట్లతో గెలిచి సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. సూర్యకుమార్ (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), తిలక్ వర్మ (24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) రాణించారు. ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలిచింది. హెడ్ (18 బంతుల్లో 8 ఫోర్లతో 35), మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు.
Updated Date - 2023-11-29T08:57:20+05:30 IST