Rahul Dravid: హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రావిడ్‌ను తొలగించండి.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో #SackDravid హ్యాష్‌ట్యాగ్
ABN, First Publish Date - 2023-07-30T16:41:25+05:30
రాహుల్ ద్రావిడ్‌ను ట్విట్టర్‌లో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
బార్బడోస్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై నెజిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రెండో వన్డేకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని దూరంగా ఉంచడాన్ని వేలెత్తి చూపుతున్నారు. టీమిండియాలో విచ్చలవిడిగా మార్పులు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న వన్డే ప్రపంచకప్ కోసం సరైన జట్టును సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న ద్రావిడ్.. కోహ్లీ, రోహిత్‌కు విశ్రాంతినిచ్చి చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. రోహిత్, కోహ్లీ లేని టీమిండియా రెండో వన్డేలో విండీస్ చేతిలో ఘోరంగా ఓడింది. స్టార్ ఆటగాళ్లైనా రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటే రెండో వన్డే మ్యాచ్ గెలిచాక, మూడో వన్డేలో ఇవ్వాలని కానీ అతి ఆత్మవిశ్వాసంతో రెండో వన్డేలోనే వారిని దూరంగా ద్రావిడ్ తప్పు చేశాడని నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ వన్డే జట్టులో నాలుగో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేక పోతుండడం కూడా ద్రావిడ్‌ను వేలెత్తి చూపేలా చేస్తుంది. భవిష్యత్‌లోనూ కోహ్లీ, రోహిత్ లేకుండా జట్టు విజయాలు సాధించగలదా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరు లేకుంటే టీమిండియాకు భవిష్యత్ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రాహుల్ ద్రావిడ్‌ను ట్విట్టర్‌లో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వచ్చాకే టీమిండియా వరుసగా కీలక మ్యాచ్‌లు ఓడిపోతుందని చెబుతున్నారు. రాహుల్ ద్రావిడ్ కోచ్ అయ్యాక బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్, సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్, 2022 ఆసియాకప్, 2022 టీ20 ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలైందని అంటున్నారు. రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ టీమిండియా అద్భుత విజయాలు సాధించిందని, ఆసియాకప్ కూడా గెలిచిందని గుర్తుచేస్తున్నారు. కానీ ద్రావిడ్ కోచ్ అయ్యాక.. కెప్టెన్‌గా రోహిత్ కూడా వరుసగా ఓటములను ఎదుర్కొవలసి వస్తుందని అంటున్నారు.
ఇక రెండో వన్డేలో టీమిండియా ఓటమి అనంతరం మాట్లాడిన ద్రావిడ్ "మేము ఎల్లప్పుడూ పెద్ద చిత్రాన్ని పరిశీలిస్తాము. మేము ప్రతి మ్యాచ్, సిరీస్ గురించి ఆలోచించలేము. ప్రపంచకప్, ఆసియా కప్‌నకు ముందు రెండు-మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే విరాట్, రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాం. మేము ఇతరుల అభిప్రాయాల గురించి పెద్దగా చింతించము. వారంతా మన దేశం నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లు. వారు మంచి ప్రదర్శనలు ఇచ్చి ఇక్కడికి వచ్చారు. యువ ఆటగాళ్లు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. కానీ వారి ప్రదర్శన పట్ల మేము కొంత నిరాశ చెందాము. ఇది గమ్మత్తైన వికెట్. బ్యాటింగ్ చేయడానికి సులభమైన వికెట్ కాదని తెలుసు. అయితే మేము 230-240 వరకు రన్స్ చేయాల్సింది. అది చాలా మంచి స్కోరు కావొచ్చు. మేము మధ్యలో వికెట్లు కోల్పోయాము. చేయాల్సిన దాని కన్నా 50-60 పరుగుల దూరంలో ఉన్నాము" అని చెప్పాడు.
Updated Date - 2023-07-30T16:41:25+05:30 IST