Telangana Elections: ‘అంటే ఆగడు.. పంటే లేవడు’... కేసీఆర్‌పై లక్ష్మణ్ విమర్శలు
ABN, First Publish Date - 2023-11-14T14:31:05+05:30
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మన్ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) అంటే కేసీఆర్ (CM KCR) ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ (Congress) అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు. కేసీఆర్‌కు సీఎంగా అవకాశం ఇస్తే అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్‌ఎస్ సర్కార్ ఉందన్నారు. ‘‘అంటే ఆగడు.. పంటే లేవడు’’ అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏండ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరిస్థితి మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమే అని అన్నారు. పూటకో అవినీతికి పాల్పడుతున్నాయని ఎంపీ ఆరోపించారు.
సౌభాగ్యలక్ష్మీ సంగతి కొత్త పథకం సరే.. గతంలోని నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. బీసీ సీఎం అన్నా.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్తే వీరికి కడుపు మంటగా ఉందన్నారు. వాళ్ళు చేయరు.. చేసేవాళ్లను విమర్శిస్తున్నారని అన్నారు. కుంభకర్ణుడిలా పదేళ్లు నిద్రపోయి.. పగటి వేష గాళ్లలాగా ఓట్లు అడుక్కునేందుకు వస్తున్నారన్నారు. కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్.. గుంటనక్కలా మారారని విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వంత పాడే పార్టీ మజ్లీస్ అని.. వీరంతా తోడు దొంగలు.. గజ దొంగలన్నారు. తమది పీపుల్స్ మేనిఫెస్టో అని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. ఇతర పార్టీల్లాగా అమలుకు సాధ్యం కాని హామీలు తాము పొందుపరచలేదన్నారు. పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళొద్దని కోరుకుంటున్నానని.. కానీ వారి వ్యక్తిగత అవసరాల కోసం వెళ్తే తాము చేసేదేముందని అన్నారు. బీఆర్‌ఎస్ మోసం చేయడం వల్ల విజయశాంతి బీజేపీకి వచ్చారని.. మళ్ళీ అక్కడికే వెళ్తారని అనుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-11-14T15:11:13+05:30 IST