ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Congress: తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్న అంశాలు ఇవేనంట!

ABN, First Publish Date - 2023-12-07T12:23:49+05:30

కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయమే లక్ష్యంగా జరిగిన ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయమే లక్ష్యంగా జరిగిన ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారెంటీలు ప్రధానపాత్ర పోషించాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు తీరు ఎలా ఉండబోతోందన్న విషయంపైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా కర్ణాటక తరహాలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా ఉండబోతోంది. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అన్న చర్చ జరుగుతోంది. మరోపక్క వంటింట్లో భారంగా మారిన గ్యాస్‌ సిలిండర్‌ కేవలం రూ. 500లకే పంపిణీ చేస్తామని ప్రకటించడంతో మహిళామణులు ఈ విషయంపైనా దృష్టి సారించారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ విషయానికి వస్తే 200 యూనిట్లలోపు 40 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా..

‘గృహజ్యోతి’ రూ.220 కోట్లు

గ్రేటర్‌లో 200 యూనిట్లలోపు కనెక్షన్లలు 40లక్షలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి అమల్లోకి వస్తే విద్యుత్‌శాఖకు ప్రతినెలా రూ. 220 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్‌జోన్‌ పరిధిలో 9 సర్కిళ్లు ఉండగా, మొత్తం 59 లక్షల విద్యుత్‌కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కమర్షియల్‌, హెచ్‌టీ కనెక్షన్లు 7 లక్షలు. 52 లక్షలు గృహ విద్యుత్‌ (డొమస్టిక్‌)కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం గృహవిద్యుత్‌ వినియోగదారుల్లో 40 లక్షల కనెక్షన్‌దారులు ప్రతి నెలా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగిస్తునట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తే ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 220 కోట్ల భారం పడే అవకాశాలుంటాయని, యేడాదికి రూ.2,640 కోట్లు డిస్కంకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో ఇలా...

కర్ణాటక రాష్ట్రంలో గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి కనెక్షన్‌ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారని విద్యుత్‌శాఖలోని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అయితే గతంలో ఆ గృహ వినియోగదారుడు ప్రతి నెలా ఎంత విద్యుత్‌ వినియోగించేవారో గుర్తించి, దానికి మరో 15-20 శాతం అదనంగా వినియోగించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

100-150 యూనిట్ల వారే అధికం..

గ్రేటర్‌ పరిధిలో 40 లక్షల గృహ కనెక్షన్లలో 35 లక్షల వరకు నెలకు 100-150 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తుంటారు. 2-3 లక్షల కనెక్షన్లలో 100 యూనిట్లలోపు, మరో 2-3 లక్షల మంది 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగిస్తుంటారు.

ఉచిత ప్రయాణానికి స్మార్ట్‌ కార్డ్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో రోజూ 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో దాదాపు 18 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం ప్రయాణికుల్లో మహిళలు 7.2లక్షల వరకు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తే ఏం చేయాలని, ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. గ్రేటర్‌లో ఇప్పటికే రద్దీ రూట్లలో ఉదయం, సాయంత్రం 10కి పైగా మహిళాస్పెషల్‌ సర్వీసులను నడిపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం నగర ఆర్టీసీకి రోజుకు రూ. 80 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు నష్టం వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తే ఆర్టీసీపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎలక్ర్టిక్‌ బస్సులను ముందు అందుబాటులోకి తెచ్చి.. ఆ తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తే కొంత మేర ఆర్టీసీకి నష్టం తగ్గుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. లేదంటే మహిళల కోసం ప్రత్యేక సర్వీసులు పెంచి నడిపిస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.

డిమాండ్‌ 7 వేల బస్సులు.. ఉన్నవి 2800 మాత్రమే..

వాస్తవంగా గ్రేటర్‌లో ప్రయాణికులకు రోజువారీగా సేవలందించాలంటే ఆర్టీసీ ప్రతిరోజు 7 వేల బస్సులు నడపాల్సి ఉందని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు వేగంగా విస్తరించడం, ఆ మేరకు బస్సుల సంఖ్య పెంచకపోవడంతో గ్రేటర్‌లో ప్రతినెలా లక్షల సంఖ్యలో ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపైకి వస్తూ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు పెద్దసంఖ్యలో కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొస్తే ప్రైవేట్‌ వాహనాల రద్దీకూడా తగ్గే అవకాశాలుంటాయని రవాణారంగ నిఫుణులు సూచిస్తున్నారు.

ఏటా కుటుంబానికి రూ. 3వేల ఆదా

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకంతో..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాల్లో మరోకటి రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌. గతంలో రూ. 450 నుంచి రూ. 500 లోపు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ. 955కు చేరింది. డెలివరీ చార్జిలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకం అమలైతే ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 3 వేల వరకు ఆదా కానుందని లెక్కలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌ జిల్లాలో 16,63,873 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో మరో 13.40 లక్షల మేరకు, మొత్తం గ్రేటర్‌వ్యాప్తంగా 30 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. అలాగే, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 135 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. రోజూ 1.20 లక్షల సిలిండర్లకు డిమాండ్‌ ఉండగా, 80 వేల సిలిండర్లను మాత్రమే ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.

రూ. 500కు తగ్గితే...

ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్‌ రూ.955 ఉండగా, రూ. 500లకే పంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ తన ఆరు గ్యారెంటీల్లో ప్రకటించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.455 తగ్గుతుంది. ఓ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే రెండు నెలలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తారు. అంటే ఏటా ఆరు సిలిండర్లు వినియోగిస్తారు. ఈ లెక్కన అలాంటి కుటుంబాలకు ఏడాదికి రూ. 3 వేల వరకు మిగలనుందని అంచనా వేస్తున్నారు.

ఎవరికి ఇస్తారో..

గృహలక్ష్మి పథకం అర్హులు ఎవరు. ఏ కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తారు అన్నది గ్రేటర్‌లో చర్చ జరుగుతోంది. ఒక్క హైదరాబాద్‌ జిల్లాను తీసుకుంటే మొత్తం 16,63,873 గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, ఆహారభద్రత కార్డులు 6,39,609 మేరకు ఉన్నాయి. కేవలం ఆహారభద్రత కార్డులున్న వారే అర్హులైతే లబ్ధిదారుల సంఖ్య విపరీతంగా తగ్గనుంది. అయితే, ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-12-07T12:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising