Revanth Reddy : ఈసీ పక్షపాత ధోరణి
ABN , First Publish Date - 2023-11-26T02:25:56+05:30 IST
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో రూ.వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు పట్టించుకోలేదని టీపీసీసీ

గోయెల్ ఇంట్లో డబ్బుపై మా ఫిర్యాదును పట్టించుకోలే
మా నేతల ఫోన్లను కూడా వికాస్‌రాజ్ ఎత్తటం లేదు
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులపై ఈడీ, ఐటీ దాడులు
రైతుబంధుపై మా విజ్ఞప్తిని బేఖాతరు చేశారు
ప్రజల సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నాల్లో బీఆర్‌ఎస్
ఆ పార్టీకి కేంద్రం, బీజేపీ అండగా ఉంటున్నాయి
మోదీ ఎన్ని జేసీబీలు పెట్టినా కేసీఆర్ ఓటమిని ఆపలేరు
ఎన్నికల ముందు రైతుబంధుతో.. ఎకరాకు 5 వేలు నష్టం
కౌలు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు: రేవంత్‌రెడ్డి
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ ఇంట్లో రూ.వెయ్యి కోట్లు డంప్ చేశారని మేం ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. రైతుబంధు నిధుల ద్వారా ప్రజల సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నాలు బీఆర్‌ఎస్ చేస్తోంది. ఆ పార్టీకి బీజేపీ, కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది.
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, బాన్సువాడ టౌన్, బిచ్కుంద, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో రూ.వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికా్‌సరాజ్.. కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులను ప్రస్తావిస్తూ.. ఈడీలు, ఇన్‌కమ్ టాక్స్‌లు కేవలం కాంగ్రె్‌సపైనే పనిచేస్తాయా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తమకు ఈ ఎన్నికల్లో పోటీ.. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలతో కాదని, ఈడీ, ఐటీలతో నేనన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, బీఆర్‌ఎస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోందని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడటంతోపాటు కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభల్లో రేవంత్ ప్రసంగించారు. ఎన్నికల ముందు రైతుబంధు డబ్బులు వేయడంతో రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున నష్టం జరుగుతోందని, కౌలు రైతులైతే పూర్తిగా నష్టపోతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ఇచ్చే రైతుబంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావద్దని, ఆందోళన కూడా చెందవద్దని, కేసీఆర్ ఇచ్చింది తీసుకోవాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ హామీ మేరకు ఇస్తామన్నారు. 2018 ఎన్నికలప్పుడు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక రైతుబంధు నిధులు విడుదల చేశారని రేవంత్ గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేశారని ఆనాడు విశ్లేషకులు చెప్పారని పేర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల నేపథ్యంలో నవంబరు 15 లోపే రైతుబంధు నిధులు విడుదల చేసి పథకం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ తాము కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతుబంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని విమర్శించారు.
ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా, మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుందన్నారు. రైతుల ఓట్ల కోసం రైతుబంధుకు అనుమతి తీసుకున్న కేసీఆర్.. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అమలుకు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు లక్ష కోట్లు దోపిడీ చేసే సామర్థ్యం ఉందిగానీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయటం చేతకాదని, చేతకాని సీఎం అని మండిపడ్డారు. రైతుబంధు తప్ప మిగతా పథకాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కేసీఆర్‌తోపాటు, బీఆర్‌ఎస్ పార్టీ ఇతర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయాలని రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు, పార్టీ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బంధుత్వం కూడా బీఆర్‌ఎస్ దృష్టిలో నేరమేనా?
వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నప్పుడు రాముడిలాగా బీజేపీకి కనిపించారని, ఆయన కాంగ్రె్‌సలో చేరటంతో ఇప్పుడు ఆ పార్టీకి రావణాసురుడిలాగా కనిపిస్తున్నారని రేవంత్ విమర్శించారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని, బంధుత్వం కూడా బీఆర్‌ఎస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోందన్నారు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వారిని టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఓడిపోతున్నామనే భయంతో కల్వకుంట్ల కుటుంబం డబ్బులు పంచేందుకు గల్లీ గల్లీ తిరుగుతోందని, ప్రజలందరూ వారిచ్చే డబ్బులు తీసుకొని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.