Share News

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:18 AM

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. గల్ఫ్ వలసలపై అవగాహన కలిగిన సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆమె అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

  • చైర్మన్‌గా విశ్రాంత ఐఎఫ్ఎస్‌ అధికారి వినోద్‌కుమార్‌

  • సీఎం హామీ మేరకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, సమగ్ర ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) విధానాన్ని రూపొందించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసూ సీఎస్‌ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్‌గా విశ్రాంత ఐఎ్‌ఫఎస్‌ అధికారి బి.ఎం.వినోద్‌కుమార్‌ను, వైస్‌ చైర్మన్‌గా మంద భీంరెడ్డిని నియమించింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రొటోకాల్‌ విభాగం సంయుక్త కార్యదర్శి స్థాయి (ఐఏఎస్‌) అధికారి కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆర్‌.భూపతిరెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ను నియమించింది. గల్ఫ్‌ వలసలపై అవగాహన కలిగిన సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, లిజీ జోసెఫ్‌, చెన్నమనేని శ్రీనివాసరావు, కొట్టాల సత్యం నారాగౌడ్‌(దుబాయ్‌), గుగ్గిళ్ల రవీందర్‌, నంగి దేవేందర్‌, స్వదేశ్‌ పరికిపండ్లను సభ్యులుగా నియమించింది.


సీఎం రేవంత్‌ గత ఏడాది ఏప్రిల్‌ 16న గల్ఫ్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే సలహా కమిటీని ఏర్పాటు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ కార్మికులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కేరళ, పంజాబ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్‌ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను అధ్యయనం చేస్తుంది. కార్మికుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్‌ దేశాలను కూడా సందర్శిస్తుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం సమగ్ర ఎన్‌ఆర్‌ఐ విధానాన్ని రూపొందిస్తుంది.

Updated Date - Apr 11 , 2025 | 05:20 AM