Harish Rao: దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారు
ABN, First Publish Date - 2023-11-15T15:19:19+05:30
దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సిద్దిపేట: దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రాష్టంలో సీఎం కేసీఆర్‌ను మ్యాచ్ చేసే లీడర్ లేడు. విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు. కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్యకు చేసే ఖర్చుగా చూడాలి. వైద్య రంగాన్ని బలోపేతం చేశాం. అన్ని స్థాయిల దవాఖానల్లో సదుపాయాలు కల్పించాము. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చాం. ఫలితంగా ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయికి తెచ్చాం. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, విద్య రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కులం, మతం, ప్రాంత వివక్ష తెలంగాణలో లేదు. వాటర్ ట్యాంకర్లు లేవు, జనరేటర్ల సప్పుల్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజులు మాత్రమే కాదు. పంప్ హౌస్‌లో టన్నెల్ కాలువలు రిజర్వాయర్లు.. ఇలా కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు హంగామా చేస్తున్నారు’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది: మంత్రి హరీశ్‌రావు
‘‘తెలంగాణ ఉద్యమ నినాదంలో భాగమైన నీళ్లను తెలంగాణ గడ్డ మీదికి నీళ్లు మల్లించాం. నిధులు.. మన నిధులు మనం వాడుకుంటున్నాము కాబట్టే సంక్షేమం అమలు చేయగలుగుతున్నారు. నియామకాలు.. మొదటి విడతలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈసారి 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాం. కరోనా రావడం, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఏడాదిన్నర ఎదురు చూడాల్సి రావడంతో రెండో విడతలో కాస్త ఆలస్యం జరిగింది.ప్రైవేట్ పరంగా ఇండస్ట్రీలో 24 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల ఉద్యోగాలు ఐటీలో వచ్చాయి. ఐటీ ఉత్పత్తుల్లో, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
పాజిటివ్ ఓటింగ్‌తో మళ్లీ అధికారంలోకి వస్తాం: మంత్రి హరీశ్‌రావు
‘‘ప్రతిపక్షాలకు ఎజెండా లేదు. గతంలో తాగునీటిపై, విద్యుత్ పై చర్చ జరిగింది. ఇప్పుడు మేము వాటిని పరిష్కరించాం. కాబట్టే మమల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారు. BRS నేతలను చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నడు. మేమూ మాట్లాడగలం. బూటుతో కొట్టాలి అని నేను కూడా అనగలను. కానీ ప్రజలకు బూతులు మాట్లాడే నాయకులు కాదు.. భవిష్యత్తు కోరే నాయకులు కావాలి. బూతులు మాట్లాడే నాయకులకు.. ప్రజలకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలే ఒక్కటి అయ్యాయి. దుబ్బాక, మునుగొడులో కాంగ్రెస్ పార్టీ సరెండర్ అయింది. ఇప్పుడు బీజేపీ లొంగిపోయింది. 7 మండలాలు బిల్లు తెచ్చింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. సీలేరు పవర్ ప్రాజెక్ట్ బిల్లు తెచ్చింది బీజేపీ.. మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. నూకలు బుక్కుమని కేంద్ర మంత్రి అవమానిస్తే మేము ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే.. కాంగ్రెస్ కనీసం ఖండించలేదు. ఊరికి ఇద్దరు పైరవీకారులకు మేలు కలగాలంటే కాంగ్రెస్ పార్టీకు ఓటేయండి.. ఊరంతా మేలు కలగాలి అంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి’’ అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది: మంత్రి హరీశ్‌రావు
‘‘మైనార్టీల ఓట్ల కోసమే బీర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీజేపీ, BRS ఒక్కటే అయితే గవర్నర్ మాకు సహకరించే వారు. ఆర్టీసీ బిల్లు అంతా సిద్ధంగా ఉంది. గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడైనా ఈసీ ఒప్పుకుంటే ప్రభుత్వంలో కలిపేస్తాం. లేదా మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేస్తాం. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని కేంద్రప్రభుత్వం 35 వేల కోట్లు ఆపింది. బీజేపీపై మేము పోరాటం చేస్తున్నాం, కేంద్రం మా మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ మా మేనిఫెస్టో కాపీ కొట్టింది. మా పథకాలకు కొంత కలిపి ఎక్కువ ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీది ఎగవేసే చరిత్ర.. మాది ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత మాది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్ణాటక రాష్ట్రంలో రాహుల్‌గాంధీ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. నేను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్తను. పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తాను. రాబోయే ప్రభుత్వంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టాలని ఉంది. ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఆత్మసంతృప్తి ఆ శాఖలో ఉంది’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Updated Date - 2023-11-15T15:19:25+05:30 IST