Ts Election: పంచుడు సంబురం మొదలైంది! ఎక్కడెక్కడ డబ్బులు పంచారంటే..!
ABN, First Publish Date - 2023-11-24T03:44:43+05:30
పోలింగ్ ఇంకా వారం రోజులు ఉండగానే.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ ప్రారంభమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి.
ఓటుకు మూడు వేల చొప్పున పంపిణీ..
కొన్ని నియోజకవర్గాల్లో రూ.వెయ్యి నుంచి రెండు వేలు
పోలింగ్ రోజుకు వారం ముందే షురూ చేసిన పార్టీలు
వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో మొదలైన పంపిణీ
ఖమ్మం రెండు నియోజకవర్గాల్లో రాత్రికి రాత్రే పూర్తి
వరంగల్‌లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభం
అభ్యర్థులకు రెండో విడత డబ్బులు పంపిస్తున్న బీఆర్‌ఎస్
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ ఇంకా వారం రోజులు ఉండగానే.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ ప్రారంభమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. ఖమ్మంజిల్లాలో హోరాహోరీగా పోరు జరుగుతున్న రెండు నియోజకవర్గాల్లో (పాలేరు, ఖమ్మం) ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఒక నియోజకవర్గంలో అయితే రాత్రికిరాత్రే పంపిణీ పూర్తయిపోయింది. ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇవ్వగా.. మరోచోట రూ.2 వేలు చొప్పున పంచారు. హైదరాబాద్‌లోనూ కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలు షురూ అయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక పార్టీ నేత ఓటుకు రూ.3వేల చొప్పున ఇస్తున్నారు. పెద్ద నియోజకవర్గం కావడం, ఎన్నికల నాటికి ‘ఓటుకు నోటు’ను అడ్డుకుంటారనే భయంతో ముందే పంచేస్తున్నట్టు తెలిసింది. అటు వరంగల్ జిల్లాలోను భూపాలపల్లి, మహబూబాబాద్, పాలకుర్తి, వర్దన్నపేట నియోజకవర్గాల్లో రూ.1000 నుంచి రూ.2 వేల దాకా డబ్బు పంపిణీ జరుగుతోంది. మరికొన్ని జిల్లాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మొదలైనట్లు సమాచారం. ఒకవైపు తనిఖీలు విస్తృతంగా జరగడం.. మరోవైపు డబ్బును ఒకచోట నిల్వ చేయడం అంత సురక్షితం కాదని అభ్యర్థులు భావించడంతో.. డబ్బు సిద్ధంగా ఉంటే పంపకాలు చేసేస్తున్నారని సమాచారం. పంపకాల వ్యవహారాన్ని చివరి రోజు రాత్రివరకూ పెట్టుకుని టెన్షన్ పడడం కంటే ముందుగానే ఇచ్చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే చాలామంది పంపిణీని ప్రారంభించారు.
ఒక్కో పార్టీదీ ఒక్కో తీరు
డబ్బు పంపిణీ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో తీరుగా ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ సహజంగానే తన అభ్యర్థులకు భారీగానే ఫండింగ్ చేస్తోంది. అధికారంలో ఉండడం, వనరులన్నీ అందుబాటులో ఉండడంతో.. అభ్యర్థులందరికీ నిధులను ఇవ్వగలుగుతోంది. ‘ఇప్పటికిది ఉంచండి’ అంటూ ప్రారంభంలోనే ఒక విడత నిధులను అభ్యర్థులకు ఇచ్చేసిన అధికార పార్టీ.. ఇప్పుడు మిగతా నిధుల సర్దుబాటు కార్యక్రమం కూడా చక్కబెట్టేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని, ఇన్‌చార్జులను నియమించుకుని మరీ పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పటివరకు పైనుంచి నిధులు వచ్చింది తక్కువే. ప్రస్తుతానికి ఆ పార్టీ అభ్యర్థులు తమ సొంత డబ్బునే ఖర్చుపెడుతున్నారు. ఆ పార్టీ సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్నవారికే టికెట్లు ఇవ్వడం వెనుక వ్యూహం కూడా ఇదేనని చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాలకు పార్టీ నుంచి ఫండింగ్ రావాల్సి ఉంది. కర్ణాటక నుంచి కొంత, పార్టీలోనే ఆర్థికంగా బలమైన నేతలనుంచి కొంత మేర సర్దుబాటు చేసి నిధులను సర్దే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. డబ్బు ఖర్చు విషయంలో కొంత వెనుకంజలో ఉండే బీజేపీ.. ఈసారి కొన్ని ఎంపిక చేసిన స్థానాల్లో భారీగాఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తాము బలంగా ఉన్న స్థానాలెన్ని, మధ్యస్థంగా ఉన్న స్థానాలెన్ని, ఒక మాదిరిగా ఉన్నవేవి? అనే ప్రాతిపదికన నియోజకవర్గాలను ఆ పార్టీ 3 కేటగిరీలుగా విభజించుకున్నట్లు సమాచారం. దీని ఆధారంగా.. బలంగా ఉన్న చోట్ల గతానికి భిన్నంగా పార్టీయే కొంతమేర అధికంగా నిధులను సర్దుబాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మిగతా చోట్లా..
అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు.. ఓటర్లకు పంచాల్సిన డబ్బును క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కసరత్తును పూర్తిచేసే పనిలో పడ్డారు. కొందరు ఇప్పటికే గ్రామాల దాకా తమ డబ్బును తీసుకెళ్లి పార్టీ నేతలకు అందజేయగా.. మిగతావారు పంపిణీకి అవసరమైన డబ్బు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. పంపిణీ ప్రారంభించని మిగతా జిల్లాల్లోనూ రెండు, మూడురోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కాలనీలు.. అపార్ట్‌మెంట్లు.. మురికివాడలు.. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో డబ్బు పంపిణీకి పార్టీలు సిద్ధమవుతున్నాయి. పంపిణీలో అభ్యర్థుల విజయావకాశాలు, ప్రతికూల పరిస్థితుల వంటివాటినీ దృష్టిలో పెట్టుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలూ సర్వేల ఆధారంగా తాము బలహీనంగా ఉన్న చోట్లే పంపకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2023-11-24T11:33:26+05:30 IST