Kishan Reddy: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అందుకు నాంది గజ్వేల్ అవ్వాలి
ABN, First Publish Date - 2023-11-07T14:25:32+05:30
సీఎం కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు.
సిద్దిపేట: సీఎం కేసీఆర్ (CM KCR) నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) అన్నారు. మంగళవారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (BJP Candidate Etela Rajender) నామినేషన్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గజ్వేల్‌లో 30 వేల కుటుంబాల భూములను లాక్కున్న కర్కోటకుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాఫియా విలయతాండవం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. దీనికి నాంది గజ్వేల్‌లో జరగాలని గజ్వేల్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ‘‘మీరు వేసే ఓటు కేసీఆర్ కుటుంబానికి వేస్తారా? మీ కుటుంబాలకు వేస్తారా. బీజేపీకి ఓటు వేస్తే మీ పిల్లల భవిష్యత్తుకు వేసినట్లు’’ అని అన్నారు. కాళేశ్వరం నీళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వస్తున్నాయన్నారు. గజ్వేల్ ప్రజలు అంగట్లో పశువులు అనుకుంటున్నారని.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని.. కానీ గజ్వేల్ ప్రజలు పులి పిల్లలు అని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు.
భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళేది సంప్రదాయమని.. కానీ కేసీఆర్ వెళ్ళరన్నారు. గజ్వేల్ డబుల్ బెడ్ రూం ఇస్తానని ఇంత వరకు ఇవ్వలేదు కానీ ఉన్న ఇండ్లు గుంజుకున్నారని ఆరోపించారు. నియంతృత్వ పాలన మీద, రజాకార్ల పాలన మీద వదిలిన బాణం ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేను కలవని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే గజ్వేల్ ప్రజలే అని చెప్పుకొచ్చారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని అనగానే పక్క నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం పెట్టుకున్నారన్నారు. ఈ పది సంవత్సరాలు కుటుంబ అభివృద్ధి చూసుకున్నానని.. ఇప్పుడు గెలిపిస్తే ప్రజల్ని చూసుకుంటా అంటున్నారని అన్నారు. ఈటెల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని అనగానే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి బీసీ బిడ్డ నరేంద్ర మోడీ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-07T14:25:33+05:30 IST