CPI ML(Maoist): సరిహద్దు అడవుల్లో పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు.. వీడియోలు విడుదల
ABN, First Publish Date - 2023-12-13T13:07:11+05:30
మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మి) వార్సికోత్సవాలకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మి) వార్సికోత్సవాలకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు దండకారణ్యం వేదికైంది. ఏటా ఈ ఉత్సవాలను మావోయిస్టులు డిసెంబర్ 2నుంచి 8వరకు నిర్వహిస్తుండగా ఈ ఏడాది కూడా మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వార్సికోత్సవాలను తెలంగాణ, చత్తీస్‌ఘడ్(Telangana, Chattisgarh) సరిహద్దు అడవుల్లో రెండు చోట్ల నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియోలను మంగళవారం మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. మావోయిస్టు(Maoist)లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షికోత్సవాల్లో పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు ఉన్నాయి. వీవే అత్యంత ప్రమాదకర వార్షికోత్సవాలుగా పోలీసు అధికారులు, లొంగిపోయిన మావోయిస్టులు చెబుతుంటారు. కాగా ఈ వార్షికోత్సవాలను మావోయిస్టులు వారంరోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా పార్టీ దిశానిద్దేశాన్ని మావోయిస్టులు నిర్ణయిస్తారు. ఈ వార్షికోత్సవాలను గతవారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో (సుకుమా, బీజాపూర్ అటవీగ్రామాల్లో) నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవాల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరైనట్లు వీడియోల్లో కనిపిస్తోంది. అలాగే అడవుల్లో ర్యాలీలు నిర్వహించి, రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు వీడియోల్లో ఉంది. మావోయిస్టు నాయకులు కూడా పార్టీ విధి విధానాలను స్థానిక ప్రజలకు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే వీడియోలతో పాటు మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఈ ఏడాది పీఎల్‌జీఏలో 54మంది మావోయిస్టులు చనిపోయారని, వీరిలో 16 మంది మహిళలు ఉన్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-12-13T13:12:12+05:30 IST