Dharani's complaints : షెడ్యూల్ పేరుతో ధరణి ఫిర్యాదులు గాలికి!
ABN , First Publish Date - 2023-10-05T03:00:14+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదు.

పట్టించుకోని కలెక్టర్లు.. సమీక్షల పేరుతో వీలుకాదంటున్న వైనం.. ఇబ్బందుల్లో బాధితులు
మేడ్చల్‌కు చెందిన ఓ రైతుకు చెందిన రెండు ఎకరాల పట్టా భూమి పీవోబీ జాబితాలో నమోదైంది. దాంట్లోంచి తొలగించేందుకు జూలైలో మీసేవ ద్వారా దరఖాస్తు చేశాడు. దాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్ తన లాగిన్‌లో నమోదైన దరఖాస్తు నంబరును తహసీల్దారుకు పంపించి నివేదిక తెప్పించుకోవాలి. కానీ ఇప్పటిదాకా కలెక్టర్ ఆ దరఖాస్తు నంబరును తహసీల్దారుకు పంపలేదు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన ఓ రైతు తన భూమి విస్తీర్ణం తక్కువగా నమోదైందని టీఎం-33 మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఇది సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌కు రివర్ట్ (మరోసారి పరిశీలించాలి) వచ్చింది. దానిని మరోసారి పరిశీలించి కావల్సిన నివేదికలు తహసీల్దారు నుంచి తెప్పించుకొని మళ్లీ సీసీఎల్‌ఏకు పంపాల్సి ఉంది. కానీ రెండు నెలలు అవుతున్నా కలెక్టర్ ఇప్పటిదాకా ఆ ఫైల్‌ను ముట్టుకోలేదు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి 6 ఎకరాల భూమి మిస్ అయిందని సిటిజన్ లాగిన్ ద్వారా టీఎం-33 మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. మరోసారి పరిశీలించాలంటూ సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌కు లాగిన్‌కు ఆ ఫైల్ పంపారు. జూలైలో వచ్చిన ఫైల్‌ను కలెక్టర్ పరిశీలించి తిరిగి సీసీఎల్‌ఏకు పంపాలి. కానీ ఆపని జరుగలేదు.
.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆయా జిల్లాల కలెక్టర్ల లాగిన్‌లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమస్యలు ఉన్నాయి. ఈ కలెక్టర్ల లాగిన్‌లోకి వచ్చిన అర్జీల్లో కొన్నింటినే కలెక్టర్లు 15-20 రోజులకోసారి పరిశీలించి.. తహశీల్దార్లకు పంపించి నివేదికలు తెప్పించుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో కలెక్టర్ లాగిన్‌లోకి వచ్చిన ప్రతి ఫైల్‌కు సంబంధించిన నివేదికల కోసం కలెక్టర్లు వెంటనే సంబంధిత తహసీల్దార్లకు పంపేవారు. తహసీల్దార్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఫైల్ అప్రూవ్ చేయాలా? రిజెక్ట్ చేయాలా? అన్నది కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వారి లాగిన్‌లోకి వచ్చిన దరఖాస్తులను కనీసం ఓపెన్ కూడా చేయడం లేదని బాధితులు పేర్కొంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ పేరుతో కాలయాపన
త్వరలో వచ్చే ఎన్నికల షెడ్యూల్ పేరుతో ధరణి పరంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలినకు కలెక్టర్లు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, ఓటరు జాబితా తయారీకి సంబంధించిన వ్యవహారాలున్నాయంటూ. ధరణి సమస్యలు పరిష్కారించడం వీలుకాదని తేలిగ్గా చెప్పేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి బాధితులు వెళ్తే ఎన్నికలకు సంబంధించిన మీటింగ్‌లు ఉన్నాయని, కలెక్టర్‌ను కలిసే అవకాశం లేదని కింది స్థాయి సిబ్బంది చెప్పి తిప్పి పంపుతున్నారు. తహసీల్దారు కార్యాలయానికి వెళ్తే ఎన్నికల నేపథ్యంలో తహసీల్దారు కలెక్టరేట్‌కు వెళ్లారని చెబుతున్నారు.
ఇలా ఎన్నికల షెడ్యూల్ పేరుతో ధరణి సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడుతున్నారు. గత రెండు నెలల నుంచి దాదాపు అన్నిచోట్ల ఈ సమస్య కారణంగా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పీవోబీలో నుంచి పట్టా భూములను తొలగించడం, ఎండోమెంట్ జాబితాలో నమోదైన పట్టా భూములను తీయడం, ఆధార్ అనుసంధానం, యజమాని పేరులో తప్పులు, జెండర్‌లో తప్పులు, డివిజన్ నంబరు, భూ విస్తీర్ణం నమోదులో నెలకొన్న తప్పులను సరిద్దేందుకు టీఎం-33లో చేసుకున్న అప్లికేషన్ల పరిష్కరిచడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బాధితులు వారి భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు మీసేవ, సిటిజన్ లాగిన్‌లో అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఈ అప్లికేషన్ నేరుగా కలెక్టర్ లాగిన్‌లోకి వెళ్తుంది. కలెక్టర్ తన లాగిన్ ఓపెన్ చేసి వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా వేరు చేసి సంబంధిత తహసీల్దార్లకు పంపాలి. కానీ కలెక్టర్ నుంచి తహశీల్దారులకు అప్లికేషన్ నంబర్లు సకాలంలో రావడం లేదని బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్